ఆఫీసులో నిద్రపోతే.. కేజ్రీ దీక్షకు లెఫ్టినెంట్ దిగివస్తారా..?

ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలో.. కేసుల భయమో కానీ ఏడాది పాటు ఎలాంటి గొడవలు లేకుండా తన పని తాను చేసుకుపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కానీ ఆయనలోని పోరాట యోధుడు వూరుకుంటాడా..? లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారంటూ స్వయంగా ధర్నాకు దిగారు.. ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ అందించే ప్రక్రియకు ఆమోదం పలకడంతో పాటు.. నాలుగు నెలల నుంచి విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వారు చేస్తున్న సమ్మె విరమించేలా చేయాలని కోరుతూ మంత్రులతో కలిసి కేజ్రీ నిరసనకు దిగారు.

నిన్న సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవాలని కేజ్రీవాల్ అనుకున్నారు.. ఆయన పిలుస్తారని కాసేపు వేచి చూశారు.. కానీ గవర్నర్ వద్ద నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో.. కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి దీక్ష చేయాలని నిర్ణయించారు. కేంద్రానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అనంతరం రాత్రి కావడంతో అక్కడే సోఫాలో నిద్రపోయారు..

జరుగుతున్న పరిణామాలను ఒక కంట గమనిస్తున్న కేంద్రం కేజ్రీవాల్‌ను ఎలాగైనా బుజ్జగించి ఇంటికి పంపించాలని చూస్తోంది. అదే సమయంలో ఆయన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గకూడదని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి కారణం లేకుండానే ముఖ్యమంత్రి నిరసన దీక్షకు దిగారని.. విధులకు హాజర్వకుండా ఆందోళన చేస్తోన్న అధికారులకు సమన్లు జారీచేయాలంటూ గవర్నర్‌పై కేజ్రీవాల్ బెదిరింపులకు దిగారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. తాము ఎలాంటి సమ్మె చేయడం లేదని ఐఏఎస్‌ల సంఘం కూడా తెలిపింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే.. కేజ్రీ డిమాండ్లను కేంద్రం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.. మరి కేజ్రీ పంతం వీడుతారా..? కేంద్రం మెట్టు దిగుతుందా..? లేక ఢిల్లీలో మళ్లీ కేంద్రం vs సీఎం వార్ కొనసాగుతుందా తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.. అంతదాకా వెళితే తనకు అండగా ఉన్న ప్రాంతీయ పక్షాల సాయంతో మోడీపై పోరాటం చేయడానికి కేజ్రీ వెనుకాడకపోవచ్చు.