అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పిల్లలతో కలిసి పాఠాలు విన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు. వారితో సంతోషంగా గడిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మళ్లీ బడికెళ్లారు. బెంచీలపై కూర్చొని పాఠాలు విన్నారు.ఆ పిల్లలతో కలిసి వీరు కూడా పిల్లల్లా మారిపోయారు. చిన్నారులతో సంతోషంగా గడిపారు. వీరితో పాటు ఢిల్లీ మంత్రులు కూడా స్కూల్ బెంచీలపై కూర్చున్నారు. ఈ దృశ్యాలన్నీ సోమవారం ఢిల్లీలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో కనిపించాయి.
ఢిల్లీలో విద్యా, వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి, అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న కృషిని పరిశీలించడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశ రాజధానికి చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీ లో చిరాగ్ ఎన్‌క్లేవ్‌లోని గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లారు.
ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇంకా పలువురు నాయకులు, అధికారులు కూడా ఈ క్లాస్ లకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఇద్దరు సీఎంలు పిల్లల పక్కనే బెంచీలపై కూర్చున్నారు. స్టూడెంట్లు క్లాస్ చెపుతుంటే ఈ నాయకులు పాఠాలు వింటున్నారు. ఆ పిల్లలు అడిగిన ప్రశ్నలకు భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ సరదాగా సమాధానం ఇచ్చారు. స్వతహాగా స్టాండ్-అప్ కమెడియన్ అయిన భగవంత్ మాన్ పిల్లలకు సమాధానం చెబుతూ క్లాస్ అంతా నవ్వులు పూయించారు.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పంజాబ్ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని అన్నారు. ఇక్కడ అన్ని రకాల ఆర్థిక నేపథ్యాలు ఉన్న విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారని చెప్పారు. ‘‘ విద్యా వ్యవస్థలో విప్లవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేము పంజాబ్‌లో కూడా ఇదే నమూనాను పునరావృతం చేస్తాం. ఇక్కడ ధనిక లేదా పేద నేపథ్యాల విద్యార్థులు కలిసి నాణ్యమైన విద్యను పొందుతున్నారు. ఇలా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం వల్ల దేశం విద్యా రంగంలో పురోగమిస్తుంది’’ అని ఆయన అన్నారు.
అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు కలిసి పని చేద్దామని చెప్పారు. ఢిల్లీలో విద్యా, వైద్య రంగాల్లో జరుగుతున్న కృషిని పరిశీలించడానికి, సమాచారాన్ని సేకరించడానికి పంజాబ్ సీఎంతో పాటు పాఠశాల విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల నుండి సీనియర్ అధికారులు ఢిల్లీకి వచ్చారని తెలిపారు.
