శివసేన గతేడాది జూన్ 20న చీలిపోయిందని, ఈ రోజును ప్రపంచ ద్రోహుల దినంగా డిక్లేర్ చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. తాము సంతకాలు సేకరించి ఐక్యరాజ్య సమితికి సమర్పిస్తామని వివరించారు. 

ముంబయి: బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ప్రస్తుతం రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ఫ్యాక్షన్‌ ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ)శివసేన ఉండగా.. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో మిగిలిన వర్గం ఉన్నది. ఈ శివసేన పార్టీ చీలిన రోజుగా జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహులుగా దినంగా ప్రకటించాలని శివసేన యూబీటీ అధికార ప్రతినిధి, రాజ్యభ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

2022 జూన్ 20వ తేదీ నుంచి అంటే.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ధిక్కరించిన ఏక్‌నాథ్ షిండే, ఆయన వెంటే వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలను శివసేన (యూబీటీ) ద్రోహులుగానే పేర్కొంటున్నది. పైసల పెట్టె తీసుకున్న ద్రోహులని విమర్శలు చేసింది.

ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జూన్ 30వ తేదీన ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు.

శివసేన (యూబీటీ) మహారాష్ట్ర స్థాయి ప్లీనరీని ఆదివారం నిర్వహించారు. ఇందులో ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్యా ఠాక్రే జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Also Read: మరికొన్ని నిమిషాల్లో మతాంతర వివాహం.. పోలీసులు వచ్చి వధువును లాక్కెళ్లిపోయారు! కేరళలో పెళ్లివేడుక వద్ద హైడ్రామా

ఈ రోజు ఫాదర్స్ డే. కానీ, కొందరు కన్న తండ్రిని దోచుకుంటారు. వారు ద్రోహులు అని ఆదిత్యా ఠాక్రే సోమవారం మాట్లాడారు. జూన్ 19వ తేదీన శివసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుకుందామని, 20వ తేదీన అంతర్జాతీయ ద్రోహుల దినంగా పాటిద్దామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రాజద్రోహం జరిగి ఉంటుందని, అలాగే, మహారాష్ట్రలో గతేడాది జరిగిందని ఠాక్రే వివరించారు. 

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక జూన్ 19న విశ్వాసుల దినంగా వేడుక, జూన్ 20న ద్రోహుల దినంగా పాటిస్తామని సంజయ్ రౌత్ వివరించారు. జూన్ 20వ తేదీన అంతర్జాతీయ ద్రోహుల దినంగా ప్రకటించాలని సంతకాలు సేకరించి ఐక్యరాజ్య సమితికి అందిస్తామని చెప్పారు.