కేరళలో ఓ మతాంతర వివాహం జరుగుతుండగా కొన్ని నిమిషాల ముందే వధవును పోలీసులు బలవంతంగా లాక్కెళ్లిపోయారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి ఆమె కనిపించడం లేదంటూ ఓ పిటిషన్ తమకు వచ్చిందని, అందుకే కోర్టులో ఆమెను హాజరుపరిచినట్టు తెలిపారు. తాను ఇష్టపూర్వకంగానే ఆయనతో జీవించాలని వెళ్లానని ఆమె చెప్పి ఆయనతోపాటే బయటకు వచ్చేసింది.  

తిరువనంతపురం: కేరళలో ఓ నాటకీయ ఘటన చోటుచేసుకుంది. మతాంతర పెళ్లి వేడుక మొత్తం ఓ సినిమా సీన్‌లో మారిపోయింది. పెళ్లికి సర్వం సిద్ధంగా ఉన్నది. మరికొద్ది నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లిపోయారు. తాను ఆయననే పెళ్లి చేసుకుంటానని మొత్తుకున్నా.. పోలీసులు వదల్లేదు. ఓ ప్రైవేటు వాహనంలో ఎక్కించుకుని కోవాలం పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు కూడా అక్కడికే వెళ్లాడు. కానీ, ఆమె వద్దకైనా ఆయనను వెళ్లనివ్వలేదు. బెదిరించారు. దురుసుగా ప్రవర్తించారు. కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేశారు. తాను ఆయనతో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంటున్నానని, ఇది తన ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అని కోర్టుకు చెప్పి ఆయనతోపాటే బయటకు నడిచింది. అంతేకాదు, రేపు తమ పెళ్లి అని ఆ జంట ప్రకటించింది కూడా.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని కోవాలం ఏరియాలో ఓ గుడిలో అఖిల్, అల్ఫియాలు మతాంతర వివాహం ఆదివారం చేసుకోవాలనుకున్నారు. అంతా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. కారు ఎక్కి కూర్చోవాలని ఆమెపై కటువుగా, బెదిరించినట్టుగానూ పోలీసు అరుస్తున్న మాటలు విజువల్స్‌లో కనిపించాయి. కోవాలం పోలీసు స్టేషన్‌లో అఖిల్‌ను అల్ఫియాతో మాట్లాడనివ్వలేదు. కనీసం దగ్గరికైనా వెళ్లనివ్వలేదు.

సోమవారం ఓ టీవీ చానెల్‌తో అల్ఫియా మాట్లాడుతూ.. తాను అఖిల్‌తో స్వేచ్ఛపూర్వక నిర్ణయంతో వెళ్లానని, ఆయనతోనే ఉండాలని నిశ్చయించుకున్నట్టు మెజిస్ట్రియల్ కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు వివరించింది. ‘నా స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత అఖిల్‌తో పాటే నేను వెళ్లడానికి అనుమతించారు. అఖిల్ కూడా కోర్టుకు వచ్చాడు’ అని అల్ఫియా తెలిపింది.

కాగా అలప్పూజా జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆ యువతి కనిపించడం లేదంటూ కాయంకులం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందిందని, అందుకే ఆమెను కోర్టులో హాజరు పరిచామని వివరించారు. ఆమెను వెంటనే కోర్టులో హాజరుపరచాలనే ఆదేశాలతో వారు అక్కడికి వెళ్లారు. కేవలం ఆ పోలీసులు వారి డ్యూటీని మాత్రమే చేశారని వివరించారు. అక్కడ బలప్రయోగం చేసినట్టు తన దృష్టికి రాలేదని అన్నారు. అఖిల్‌తో వెళ్లాలని అల్ఫియా అన్నదని, అలాగే వెళ్లిపోయిందని వివరించారు. పోలీసు తీరుపై వస్తున్న కామెంట్లనూ తాము పరిశీలిస్తామని చెప్పారు.

Also Read: ఆ ఊర్లో ఐదు రోజులపాటు ఆడాళ్లంతా బట్టలు వేసుకోకుండా ఉంటారట.. మన దేశంలోనే ఎక్కడో తెలుసా?

అఖిల్‌తో వెళ్ళడానికి ముందే తాను వెళ్లుతున్నట్టు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు అల్ఫియా తెలిపింది. సుమారు ఏడాది కాలంగా అఖిల్ తనకు పరిచయం అని వివరించింది. కాయంకులంలో మిస్సింగ్ కంప్లైంట్ తన తల్లిదండ్రులే ఇచ్చారని, తాను అఖిల్‌తో ఉండటం వారికి ఇష్టం లేదని, అందుకే అక్కడి నుంచి తనను తీసుకెళ్లడానికే ఈ ఫిర్యాదు చేశారని అల్ఫియా తెలిపింది.

ఈ ఘటన తమను దూరం చేయలేదని, పెళ్లి చేసుకోవాలన్న తీర్మానాన్ని మరింత బలపరిచిందని ఆ జంట పేర్కొంది. రేపు తాము పెళ్లి చేసుకోబోతున్నట్టూ వారు వెల్లడించారు.

అంతేకాదు, పోలీసు తీరు సబబుగా లేదని, దానిపైనా ఫిర్యాదు చేస్తానని అఖిల్ పేర్కొన్నారు.