Asianet News TeluguAsianet News Telugu

ముఖేశ్ అంబానీకి మూడో సారి హత్యా బెదిరింపులు.. ఈ సారి ఎన్నికోట్లు డిమాండ్ చేశారంటే ?

భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి వరుసగా హత్య బెదిరింపులు వస్తున్నాయి. గత శుక్రవారం ఓ అగంతకుడి మెయిల్ ఐడీ నుంచి అంబానీ మెయిల్ ఐడీకి హత్య బెదింపులు వచ్చాయి. మళ్లీ ఆదివారం కూడా అలాంటి హెచ్చరికలే వచ్చాడు. తాజాగా సోమవారం మూడో సారి కూడా బెదింపులు వచ్చాయి. 

Death threats to Mukesh Ambani for the third time.. Did they demand elections this time?..ISR
Author
First Published Oct 31, 2023, 9:49 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీకి మరో సారి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు మెయిల్ ద్వారా బెదిరింపులు రాగా.. తాజా బెదిరింపు మూడోది. మొదటి సారి దుండగుడు రూ.20 కోట్లు డిమాండ్ చేయగా.. రెండో సారి దానిని రూ.200 కోట్లుకు పెంచాడు. మూడో సారి ఎన్నికోట్లు డిమాండ్ చేశాడంటే ?

భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి వరుసగా ప్రాణ హాని బెదిరింపులు వస్తున్నాయి. ఇవన్నీ ఒకే మెయిల్ ఐడీ నుంచి రావడం గమనార్హం. గత శుక్రవారం (అక్టోబర్ 27వ తేదీ) మొదటి మెయిల్ వచ్చింది. అందులో  ‘‘మాకు రూ.20 కోట్లు ఇవ్వు. లేకపోతే చంపేస్తాం. భారత్ లో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారు’’ అని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో  ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  గాందేవి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 387 (ప్రాణభయం లేదా తీవ్రంగా గాయపరచడం), 506 (2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

మొదటి మెయిల్ కు ముఖేష్ అంబానీ స్పందించకపోవడంతో అదే మెయిల్ ఐడీ నుంచి ఆదివారం మరో మెయిల్ వచ్చింది. అందులో ‘‘మీరు మా ఈమెయిల్ కు స్పందించలేదు. ఇప్పుడు ఆ మొత్తం రూ.200 కోట్లు, లేదంటే డెత్ వారెంట్ పై సంతకం అయిపోతుంది’’ అని దుండుగుడు హెచ్చరించాడు. ఈ బెదిరింపును కూడా సెక్యూరిటీ ఇంఛార్జ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 

తాజాగా సోమవారం కూడా  అదే ఐడీ నుంచి వచ్చిన మెయిల్ లో.. తనకు రూ.400 కోట్లు ఇవ్వాలని దుండగుడు డిమాండ్ చేశాడు. ఇది గత 4 రోజుల్లో పంపిన బెదిరింపుల వరుసలో మూడో హత్యా బెదిరింపు. కాగా.. ఈ బెదిరింపు మెయిల్స్ పై పోలీసు అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. వీటిని పంపిన వ్యక్తిని షాదాబ్ ఖాన్ గా గుర్తించారు. అలాగే ఈ మెయిల్స్ బెల్జియం నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ ఐడీ ప్రామాణికతను, దాని చిరునామాకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు వారు బెల్జియం ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా.. ముఖేష్ అంబానీకి ఇళాంటి బెదింపులు రావడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు హత్యా బెదిరింపు కాల్స్ చేసిన బీహార్ లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చివేస్తానని బెదిరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios