వృద్ధుడిని బైక్ తో ఢీకొట్టాడని.. దళిత యువకుడిని కొట్టి చంపారు.. యూపీలో దారుణం..
యూపీలోని డియోరియాలో వృద్ధుడిని బైక్ తో ఢీ కొట్టినందుకు ఓ దళిత యువకుడిని జనం కొట్టారు. యువకుడిని గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించగా, అక్కడ చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జనవరి 13న ఒక దళిత యువకుడు బైక్ తో ఓ వృద్ధుడిని ఢీ కొట్టాడు. దీంతో ఆ వృద్ధుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో వృద్ధుడి కాలు విరిగింది. ఇది చూసిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని, తీవ్రంగా కొట్టారు.
ప్రమాదం తర్వాత, వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చాడు, అతడి వెనకే ఒక గుంపు అతనిని అనుసరించింది. ఆ తరువాత అతడిని విచక్షణా రహితంగా కర్రలతో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దెబ్బలకు తట్టుకోలేక అతను వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన వారిలోని కొందరు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు.
అక్కడ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 16న మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గుజేసర్ యాదవ్, రాంహాన్స్ యాదవ్, శైలేష్ యాదవ్, శ్రీరామ్ యాదవ్, రామ్ ప్రవేశ్ యాదవ్, రాజు యాదవ్‌లపై గతంలో సెక్షన్ 307 ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, దళితుడు చనిపోయిన తర్వాత వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
క్రైం బ్రాంచ్ నుంచి సస్పెండైన కానిస్టేబుల్ చేసిన క్రైంకి... పోలీసులకే దిమ్మతిరిగింది..
ఇదిలా ఉండగా, కర్ణాటకలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. ఈ ఘటనలో వృద్ధుడిని రక్షించారు. బెంగళూరులో మంగళవారం ఓ యువకుడు బండి నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చాడు. ఇంకేముంది ఇంకో వాహనాన్ని ఢీకొట్టాడు. తప్పు తనదని తెలుసు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అమానుషంగా వ్యవహరించాడు. బెంగళూరులోని మాగడి రోడ్డు టోలుగేటు వద్దకు టూవీలర్ పై ఓ యువకుడు వచ్చాడు. అతడి పేరు సోహైల్ (25). వేగంగా వచ్చి ఓ జీపును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనానికి, జీపుకు డ్యామేజ్ అయింది. జీపు డ్రైవర్ ముత్తప్ప శివ శంకరప్ప (71) ఒక కుదుపుకు కంగారుపడ్డాడు. ఆ జీపు దిగి,స్థానికుల సహాయంతో యువకుడిని పట్టుకున్నారు. దెబ్బతిన్న జీపుకు రిపేర్ చేయించాలని అడిగాడు. లేదంటే రిపేరుకు అయ్యే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే, సదరు నిందితుడు మాత్రం తన టు వీలర్ కూడా దెబ్బతిన్నది అని, అయినా తను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే యువకుడు పారిపోకుండా పట్టుకునే ప్రయత్నంలో జీపు డ్రైవర్ ముత్తప్ప బైక్ ను గట్టిగా పట్టుకున్నాడు. అయితే నిందితుడు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అలాగే ముత్తపతో సహా బైక్ ను ముందుకు దూకించాడు.
బైక్ ను ఆపకుండా.. కిలోమీటర్ దూరం వరకు ముత్తప్పను అలాగే ఈడ్చుకువెళ్ళాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇది గమనించారు. వెంటనే టు వీలర్ ను ఆపి.. ముత్తపను కాపాడారు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి యువకుడిని పట్టించారు.