30 ఏళ్ల షకూర్ ఖాన్ తనపై అత్యాచారం చేసి నిప్పంటించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ : రాజస్థాన్‌లో ఓ దళిత మహిళను అతి దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమె మీద మండే రసాయనం వేసి నిప్పంటించారు. ఈ భయంకరమైన ఘటన రాజస్థాన్‌ని బార్మర్‌లోని పచ్‌పద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. ఈ మేరకు ఓ దళిత మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. 44 ఏళ్ల బాధిత మహిళ రసాయనం కారణంగా 50 శాతం కాలిన గాయాలకు గురయ్యిందని తెలిపారు.
మహిళకు నిప్పంటించిన తరువాత నిందితులు అక్కడినుంచి పారిపోయారు. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే ఆ మహిళను మొదట చికిత్స కోసం బలోత్రాలోని నహతా ఆసుపత్రిలో చేర్చారు, అయితే ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో జోధ్‌పూర్‌కు రిఫర్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల షకూర్ ఖాన్ తన ఇంట్లోకి చొరబడి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఘటన జరిగిన తర్వాత ఆ మహిళ తనను గుర్తించింది కాబట్టి.. అందరికీ చెబుతుందని.. తన నేరం బయటపడుతుందని భయపడిన నిందితుడు ఏదో రసాయనం పోశాడు. ఆ తరువాత నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు వెనుకాడారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో దళిత సంఘాల సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు.శుక్రవారం, పోలీసులు భారతీయ శిక్షాస్మృతి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి షకూర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 54 ఏళ్ల ప్యూన్‌తో పాటు అతని ముగ్గురు సహచరులు ఆమెకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అజయ్ అనే ప్యూన్‌ను అరెస్టు చేశామని, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. ఘజియాబాద్‌లో నివసించే ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన అజయ్ గత పదేళ్లుగా ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) నగర పోలీసులకు, ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 14 న జరిగింది. సంఘటన జరిగినప్పటి నుండి, బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. దీనిమీద సత్వర చర్యలు తీసుకోనందుకు, వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయనందుకు పాఠశాల ప్రిన్సిపాల్‌కు, క్లాస్ టీచర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎమ్ సిడీ ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత బాలిక ఫైనల్ ఎగ్జామ్స్ కు రాకపోవడంతో.. ఆమె క్లాస్ టీచర్ బాలిక సోదరుడిని ఎందుకు రాలేదని ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు టీచర్‌కు తెలిపాడని పోలీసులు తెలిపారు.
