భూ వివాదంలో దళిత రైతు సజీవ దహనం

Dalit farmer in Madhya Pradesh set on fire over land dispute
Highlights

భూమి వద్దే పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రత్యర్థులు...

తన భూమిని కాపాడుకునే క్రమంలో ఓ దళిత రైతు సజీవ దహనమయ్యాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆక్రమించుకోడానికి ప్రయత్నించిన ప్రత్యర్థులతో వివాదం జరగ్గా, ఈ దళిత రైతును పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్ర గాయాలపాలై అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

 ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోపాల్‌ జిల్లా పరోసియా ఘట్‌ఖేది గ్రామానికి చెందిన కిషోరీలాల్‌ జాదవ్‌(55) అనే దళితునికి 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మూడెకరాల భూమిని ఇచ్చింది. దీంతో అతడు ఈ భూమినే నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అమితే ఈ భూమిని ఆనుకొని అదే గ్రామానికి చెందిన తిరణ్‌ యాదవ్‌ భూమి ఉంది. కిషోరీలాల్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తిరణ్ ప్రతి సంవత్సరం కొంత మేర భూమిని దున్నుతూ ఆక్రమించడం ప్రారంభించాడు. ఇలా 20 సంవత్సరాల్లో చాలా భూమిని ఆక్రమించాడు.

 దీంతో తన భూమిని తిరణ్ ఆక్రమిస్తున్నట్లు గుర్తించిన కిషోరీలాల్ ల్యాండ్‌ సర్వే చేయించాడు. ఇందులో తిరణ్ భూ ఆక్రమణ బైటపడింది. అయినా కూడా అక్రమంగా ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వటానికి అతడు అంగీకరించలేదు. దీంతో ఇరువురి మద్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో తిరణ్ తన బంధువులతో కలిసి ఈ దళిత రైతుతో పాటు అతడి భార్యపై దాడి చేశారు. అంతేకాకుండా తీవ్ర గాయాలపాలైన కిషోరీలాల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడే మృతిచెందాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి నిందితులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

loader