రాజస్తాన్‌లో 15 ఏళ్ల బాలుడు క్లాస్ రూంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు టీచర్లు కులాన్ని ప్రస్తావిస్తూ దూషించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు.
జైపూర్: రాజస్తాన్‌లో ఓ కుల వివక్ష ఘటన చోటుచేసుకుంది. ఆ వివక్ష 15 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు కారణమైంది. కులాన్ని ప్రస్తావిస్తూ దూషించడంతో మనస్తాపానికి గురైన బాలుడు క్లాసు రూంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జైపూర్‌లోని కట్‌పుత్లిలో చోటుచేసుకుంది.
దీంతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఆ స్కూల్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలుడిపై కుల పరమైన దూషణలు చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు హత్యా నేరం, ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇద్దరు టీచర్లు తమ బిడ్డను వేధించారని మృతి చెందిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, ఆ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కూడా ఎలాంటి చర్యలు వారిపై తీసుకోలేదని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు టీచర్లపై సస్పెన్షన వేటు పడింది.
ఈ ఘటనపై పోలీసు కేసు, బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని స్కూల్ యాజమాన్యం హామీ ఇచ్చిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తమ ఆందోళనను విరమించారు.
Also Read: అసోంలోని ఈ గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తున్నది. ఎందుకో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్‌కు సంబంధించిన వైరల్ వీడియో సృష్టించిన కలకలం ఇంకా ముగియకముందే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంపపై కొట్టించిన టీచర్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది మత పరమైన ద్వేషంతో జరిగిన ఘటన అని ఆరోపణలు వచ్చాయి. కాగా, రాజస్తాన్‌లో కులపరమైన ఘటన 15 ఏళ్ల బాలుడిని బలి తీసుకుంది.
