పాకిస్తాన్ జైలులో గూఢచారి ముద్రతో 22 ఏళ్లు చిత్రహింస అనుభవించి ఖైదీల దాడిలో మరణించిన సరబ్‌జిత్ సింగ్ అక్క దల్బీర్ కౌర్ మరణించారు. ఆమె తన జీవితంలో తమ్ముడి విడుదల కోసం పోరాడింది. పాకిస్తాన్ కూడా వెళ్లి తమ్ముడిని చూసింది. 

న్యూఢిల్లీ: సరబ్‌జిత్ సింగ్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయం చేసుకునే ఆయన అనుకోకుండా సరిహద్దు దాటాడు. దీంతో పాకిస్తాన్ అధికారులు ఆయనను ఓ గూఢాచారి అని కట్టుకథలు చెప్పి జైలులో వేసి టార్చర్ చేసిన ఘటనలు భారతీయులను ఎంతో గాయపరిచాయి. తమ్ముడి విడుదల కోసం అక్క దల్బీర్ కౌర్ రాజీ లేని పోరాటాన్ని కూడా మరిచిపోరు. సోదరుడు సరబ్‌జిత్ సింగ్ విడుదల కోసం పోరాడి ఓడిన దల్బీర్ కౌర్ తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి ఆమె మరణించారు. పంజాబ్‌లోని భిఖివిండ్‌లో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

దల్బీర్ కౌర్ జీవితమంతా సోదరుడు సరబ్‌జిత్ సింగ్ విడుదల కోసం చేసిన పోరాటమే ఉన్నది. సరబ్‌జిత్ పంంజాబ్‌లోని భిఖివిండ్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న సాగు భూమిలో వ్యవసాయం చేసేవాడు. ఒకసారి ఆయన మందు మత్తులో తూలుతూ నడుస్తూ భారత్, పాకిస్తాన్ సరిహద్దు దాటాడు. పాకిస్తాన్ అధికారులు దాని వక్రబుద్ధితో సరబ్‌జిత్ సింగ్‌ను గూఢచారిగా ముద్ర వేసింది. ఆ దేశ కోర్టు ఆయనకు మరణ శిక్ష వేసింది. 1991 నుంచి 2013 వరకు సరబ్‌జిత్ సింగ్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవించాడు.

మరణ శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2013లో జైలులోనే కొందరు దుండగులు సరబ్‌జిత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశారు. తోటి ఖైదీల దాడులో దారుణంగా గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్‌ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తలకు బలమైన గాయం తగిలింది. ఈ గాయాలతో సరబ్‌జిత్ సింగ్ కోమాలోకి వెళ్లిపోయాడు. లాహోర్‌లోని జిన్నా హాస్పిటల్‌లో సరబ్‌జిత్ సింగ్ సుమారు ఐదు రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. ఆ తర్వాత వైద్యులు అతడు మరణించినట్టుగా ప్రకటించారు.

సరబ్‌జిత్ సింగ్ పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 22 ఏళ్లు దల్బీర్ కౌర్ తమ్ముడి విడుదల కోసం పోరాడారు. సరబ్‌జిత్ సింగ్ అమాయకుడని, అనుకోకుండానే సరిహద్దు దాటాడని ఆమె ఆ 22 ఏళ్లు కలిసిన అధికారులకు చెబుతూనే వచ్చారు. తన సోదరుడిని చూడటానికి ఆమె పాకిస్తాన్ కూడా వెళ్లారు.

సరబ్‌జిత్ సింగ్ మరణంపై దర్యాప్తు చేయాలని అప్పటి భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. దల్బీర్ కౌర్ కూడా ఇదే డిమాండ్ వినిపించారు. తన తమ్ముడు సరబ్‌జిత్‌పై దాడి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రణాళికనే అయితే దర్యాప్తు అవసరం లేదని, కానీ, అధికారులకు తెలియకుండా తన తమ్ముడిపై దాడి జరిగి ఉంటే మాత్రం కచ్చితంగా దర్యాప్తు చేయాలని ఆమె బలంగా డిమాండ్ చేశారు.