సారాంశం

Shimla: హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిమ్లాలోని ఓ రెస్టారెంట్ లో మంగ‌ళ‌వారం సాయంత్రం సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు.
 

Cylinder Blast In Shimla: హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో సిలిండర్ పేలి ఒకరు మృతి, పలువురికి గాయాలు అయ్యాయి. సిమ్లాలోని ఓ రెస్టారెంట్ లో మంగ‌ళ‌వారం సాయంత్రం సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సిమ్లా నడిబొడ్డున మాల్ రోడ్డులోని అగ్నిమాపక సిబ్బంది కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న భోజనశాలలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మొత్తంగా 10 మంది గాయపడ్డారు. మాల్ రోడ్డు దిగువన మిడిల్ బజార్ లో ఉన్న హిమాచలీ వంటకాలను వడ్డించడానికి ప్రసిద్ధి చెందిన హిమాచలీ రసోయి రెస్టారెంట్ లో పేలుడు సంభవించిందనీ, నాలుగైదు దుకాణాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు.

పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే చుట్టుపక్కల ఉన్న పలు దుకాణాలు, ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోవ‌డంతో పాటు కొన్ని మైళ్ల దూరం వ‌ర‌కు పెలుడు శబ్దం వినిపించింది. ఘటనాస్థలి అగ్నిమాపక కేంద్రానికి, పోలీస్ కంట్రోల్ రూంకు కొన్ని మీటర్ల దూరంలో ఉండటంతో అగ్నిమాపక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. పేలుడుకు 20 నిమిషాల ముందు గ్యాస్ లీక్ అయినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. సిలిండర్ పేలడం వల్లే ఇలా జరిగిందని వారు అనుమానిస్తున్నారు. 

ఈ పేలుడులో ఒకరు మృతి చెందారు. కాలిన గాయాలతో ఉన్న మరో పది మందిని వెంటనే సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఐజీఎంసీహెచ్)కు తరలించామనీ, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయనీ, పేలుడుకు గల కారణాలను త్వరలోనే కనుగొంటామని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి కరణ్ నందా ఈ ప్ర‌మాదంపై విచారణ జరిపించాలనీ, దుకాణాలు దెబ్బతిన్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.