పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు మధ్య ప్రాంతానికి ఆనుకొని కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో తుఫాన్‌గా బలపడింది. ఈ తుఫాన్‌కు థాయ్‌లాండ్ సూచించిన సిత్రాంగ్ అనే పేరు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు మధ్య ప్రాంతానికి ఆనుకొని కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో తుఫాన్‌గా బలపడింది. ఈ తుఫాన్‌కు థాయ్‌లాండ్ సూచించిన సిత్రాంగ్ అనే పేరు పెట్టారు. సిత్రాంగ్ తుఫాను ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ అక్టోబర్ 24న తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ.. అక్టోబర్ 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బరిసాల్‌కు సమీపంలో సిత్రాంగ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. 

ఇక, సిత్రాంగ్ తుఫాన్ నేపథ్యంలో అక్టోబర్ 24-25 మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఆఫ్‌షోర్ కార్యకలాపాలను నిలిపివేయాలని భారత వాతావరణ శాఖ సలహాను జారీ చేసింది. అలాగే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికను జారీచేసింది. సోమవారం ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వేగం నుంచి గంటకు 60 కిలోమీటర్లకు చేరుకుని క్రమంగా 60-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల వేగం గంటకు 90 కి.మీకు కూడా చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. త్రిపురపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని.. 24 గంటల్లో గరిష్టంగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. త్రిపుర, అస్సాం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లకు "రెడ్ అలర్ట్", అరుణాచల్ ప్రదేశ్‌కు "ఆరెంజ్ అలర్ట్" జారీ చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 26 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశించింది.

ఇక, సిత్రాంగ్ తుఫాను సముద్రం లోపలి నుంచే బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. తీరం దాటే ముందు అది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాన్ని సిత్రాంగ్ తుఫాన్ టచ్ చేయకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని.. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్య్సకారులు వెనక్కి వచ్చేయాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. 

అయితే ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.