తీవ్ర తుఫాన్ గా మారిన హమూన్: ఏడు రాష్ట్రాల్లో వర్షాలు
హమూన్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య దిశగా తుఫాన్ కదులుతుందని ఐఎండీ ఇవాళ ప్రకటించింది.
న్యూఢిల్లీ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్ 'తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారంనాడు ఉదయం ప్రకటించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా హమూన్ తుఫాన్ గంటకు 18 కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతుందని ఐఎండీ ప్రకటించింది. తుఫాన్ ఆరు గంటల పాటు కదిలిన తర్వాత తీవ్ర తుఫాన్ గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా తుపాన్ కేంద్రీకృతమైందని ఐఎండీ వివరించింది. ఒడిశాలోని పారాదీప్ నకు ఆగ్నేయంగా, పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 25న మధ్యాహ్నం బంగ్లాదేశ్ చిట్టగాంగ్, ఖేప్ పురా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. హమూన్ తుఫాన్ కారణంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేసింది.
ఈ తుఫాన్ కారణంగా ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అస్సాం ,మేఘాలయ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ సూచించింది. మణిపూర్, మిజోరాం, దక్షిణ అస్సాం, మేఘాలయలో ఇవాళ , రేపు వర్షాలు కురుస్తాయి. ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురవనున్నాయని ఐఎండి తెలిపింది.తుఫాన్ కారణంగా మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.
మరో వైపు అరేబియా సముద్రం లో తేజ్ అనే మరో తుఫాన్ ఏర్పడింది. ఈ తుఫాన్ ఆదివారం నాటికి తీవ్ర తుఫాన్ గా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తేజ్ తుఫాన్ యెమెన్ తీర్ ప్రాంతంపై తీవ్ర తుఫాన్ గా బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్ మరో ఆరు గంటల్లో వాయువ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ సోషల్ మీడియాలో వివరించింది.