పూరి: అత్యంత బలమైన ఫణి తుఫాను తాకిడికి ఒడిశాలో 15 మంది బలయ్యారు. ఒడిశాలోని జైపూర్ లో ఈ మరణాలు సంభవించాయి. ఒడిశాలోని భద్రక్ లో శనివారం ఉదయం ఒకరు మరణించారు. 

ఫణి తుఫాను శనివారంనాడు బంగ్లాదేశ్ కు చేరుకుంది. ఒడిశాలో తీరం దాటిన తర్వాత తుఫాను పశ్చిమ బెంగాల్ చేరుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ లో తుఫాను వాయుగుండగా మారింది. దానికి ముందు ఒడిశాలో ఫణి తుఫాను బీభత్సం సృష్టించింది. 

పశ్చిమ బెంగాల్ లో దిఘా, హల్దియా, తాజ్ పూర్, మందర్మని, సందేశ్ ఖలి, కోంటాయి, డైమండ్ హార్బర్, బంకురా, శ్రీనికేతన్, అసన్ సోల్, డమ్ డమ్, అలిపోర్ వంటి పలు పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. 

బెంగాల్ తుఫాను తాకిడికి చెట్లు కుప్పకూలాయి. విద్యుత్తు, టెలికం లైన్స్ తెగిపోయాయి. అయితే, పశ్చిమ బెంగాల్ లో ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. 

ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే ఈ సాయంత్రం భువనేశ్వర్ నుంచి బెంగళూర్ కు ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ ప్రత్యేక రైలు సాయంత్రం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి బయ.లుదేరుతుంది.  మే 6వ తేదీ తెల్లవారు జామున 1.35 గంటలకు బెంగుళూర్ చేరుతుంది. 

ఈ రైలు ఖుర్దా రోడ్డు, బ్రహ్మపూర్, పలాస, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుంతకల్, ధర్మవరంల్లో ఆగుతుంది.