Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను విధ్వంసం.. ఏపీ, తమిళనాడు అతలాకుతలం
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ దక్షిణభారతంలో బీభత్సం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షంతో విరుచుకుపడుతోంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రస్తుతం బాపట్ల సమీపంలో మిచౌంగ్ తుఫాను తీరం తాకిందని వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో కారణంగా విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక తమిళనాడులో మిచౌంగ్ తుఫాను జనజీవనాన్ని స్తంభింపజేసింది. చెన్నైలో గత 45 ఏండ్లలో చూడని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మిచౌంగ్ తుఫాను చెన్నైని జలమయం చేసింది. పలువురు ప్రాణాలు తీసుకోవడంతో పాటు అనేక ఆస్తులను నాశనం చేసింది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మంగళవారం కూడా తమిళనాడు రాజధానిలో నీరు నిలిచిపోవడంతో పలు రహదారులు, సబ్వేలు మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో తుపాను తీరం దాటనుంది. 2021 సెప్టెంబర్ లో తీరాన్ని తాకిన గులాబ్ తుఫాను రెండేళ్ల తర్వాత మిచాంగ్ తొలిసారిగా తీరం దాటనుంది.
బీసెంట్ నగర్ లో చెట్టు కూలిన ఘటనలో ఇద్దరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతి చెందారు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ సమీపంలోని ప్లాట్ ఫాంపై సుమారు 70 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించారు. చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించి వీధులను ముంచెత్తింది, మధురవాయల్ ప్రాంతం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. తుఫాను నేపథ్యంలో ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ్, గంజాం, గజపతి జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి వర్షపాతం నమోదవుతున్నదని అధికారులు తెలిపారు.