Cyclone Biparjoy: బిపర్జోయ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. బిపర్జోయ్ తుఫాన్ సన్నద్ధతను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల నిర్వహణ, నష్టం జరిగితే తక్షణ పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
PM Modi holds high-level meeting on Cyclone Biparjoy: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తుఫాను పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రధాని ఆదేశించారు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అన్ని అత్యవసర సేవల నిర్వహణ ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటికి నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరించేకు ఏర్పాటు చేయాలని సూచింఆరు.
తుఫాను తీవ్రత పెరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటుట ప్రజా భద్రతకు భరోసా కల్పించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లు 24 గంటలూ పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫాను దృష్ట్యా అధికారులు సముంద్ర తీరాల జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరాల్లో చేపల వేట కార్యకలాపాలను నిలిపివేశారు.
ఇప్పటివరకు 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తీరప్రాంత ద్వారకా అధికారులు తెలిపారు. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుండటంతో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మత్స్యకారులు ఈ నెల 15 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తీరప్రాంతాల్లో హెచ్చరికలు పంపారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ఆన్షోర్, ఆఫ్షోర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలనీ, కచ్, దేవభూమి ద్వారకా, పోరుబందరు, జామ్ నగర్, రాజ్ కోట్, జునాగఢ్, మోర్బి జిల్లాలతో సహా సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల నుండి తరలింపును సమీకరించాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. IMD శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ దాస్ మాట్లాడుతూ.. బిపార్జోయ్ తుఫాను రాబోయే 12 గంటల్లో 'అత్యంత తీవ్రమైన తుఫాను'గా మారుతుందని తెలిపారు.
