న్యూఢిల్లీ: సైకిల్ గర్ల్‌గా పేరొందిన జ్యోతి తండ్రి  మోహన్ గుండెపోటుతో మరణించాడు. గత ఏడాది కరోనా సమయంలో గాయంతో ఇబ్బందిపడుతున్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకొని 1200 కి.మీ ప్రయాణించి స్వంత ఊరికి  జ్యోతి వచ్చింది. దీంతో జ్యోతి పేరు దేశమంతా మార్మోగిపోయింది. జ్యోతి తండ్రి మరణంపై దర్బంగ జిల్లా అధికారులు ఓ ప్రకటన చేశారు. జ్యోతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకొంటామని ప్రకటించారు. 

బీహార్ లోని దర్బంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్  పాస్వాన్ జీవనోపాధి కోసం గురుగ్రామ్ లో ఆటో నడిపేవాడు.  ఆయనకు ముగ్గురు పిల్లలు.  గత ఏడాది లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ విఫమం తెలిసి ఆయన పెద్ద కూతురు ఆయనను చూసేందుకు గురుగ్రామ్ వెళ్లింది. అదే సమయంలో లాక్ డౌన్ కేంద్రం ప్రకటించింది.తండ్రీ కూతురు అక్కడే చిక్కుకుపోయారు. 

పనిచేయకపోవడం నడవలేని స్థితిలో ఉన్న మోహన్ ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని యజమాని ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు చేతిలో డబ్బులు కూడ లేవు.  దీంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో పాత సైకిల్ తీసుకొని తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకొని జ్యోతి గురుగ్రామ్ నుండి 1200 కి.మీ దూరంలోని తమ స్వగ్రామానికి చేరుకొంది.దీంతో జ్యోతి పేరు మీడియా ప్రముఖంగా ప్రచురించాయి. జ్యోతి సాహసం అప్పట్లో చర్చకు దారితీసింది.భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడ ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.