Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో చ‌రిత్ర సృష్టించిన సౌరవ్ ఘోషల్.. భార‌త్ కు మొద‌టి సింగిల్స్ పతకం

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్య ప‌త‌కం సాధించాడు. ఘోష‌ల్ గతంలో ఆసియా క్రీడల్లో మూడు సింగిల్స్ కాంస్య ప‌త‌కాలు, ఒక సింగిల్స్ రజతం గెలుచుకున్నాడు. అలాగే, ఆసియా క్రీడల జట్టు స్వర్ణం కూడా సాధించాడు.
 

CWG 2022: Sourav Ghoshal creates history in Commonwealth Games 2022.. India's first singles medal
Author
Hyderabad, First Published Aug 4, 2022, 12:01 AM IST

Saurav Ghosal: కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోష‌ల్ బుధవారం తన మొదటి సింగిల్స్ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ విల్‌స్ట్రాప్‌ను వరుస గేమ్‌లలో ఓడించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో  సౌరవ్ ఘోష‌ల్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

వివ‌రాల్లోకెళ్తే.. స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన సౌరవ్ ఘోషల్ 11-6, 11-1, 11-4తో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ విల్‌స్ట్రాప్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భార‌త్  పతకాల సంఖ్యను 15కి చేర్చాడు. బర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న Commonwealth Games 2022లో ఇప్పటి వరకు భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్య పతకాలను సాధించింది. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సౌరవ్ ఘోష‌ల్.. బుధ‌వారం జ‌రిగిన గేమ్ లో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ విల్‌స్ట్రాప్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వ‌రుస సెట్ల‌లో ఒడించాడు.

తొలి గేమ్‌లో ఆరంభంలోనే ఆధిక్యం సాధించి చివరి వరకు దాన్ని సుస్థిరం చేసుకుంది. గేమ్‌ను 11-6తో చేజిక్కించుకున్నాడు. అయితే, రెండవ గేమ్‌లో ఘోష‌ల్ ఫ్రంట్‌ఫుట్‌లో ఆడటం ప్రారంభించాడు. విల్‌స్ట్రోప్‌ను ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. రెండో గేమ్ ను ఏకంగా 11-1తో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లి  వరుసగా మరో ఆరు పాయింట్లు సాధించాడు. మూడో గేమ్‌ను కూడా పెద్దగా కష్టపడకుండానే  తేలిగ్గా నెగ్గాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన పాల్ కోల్‌ని ఓడించాడు. కాగా, సౌరవ్ ఘోషల్ గ‌తంలో ఆసియా క్రీడల్లో మూడు సింగిల్స్ కాంస్య ప‌త‌కాలు, ఒక సింగిల్స్ రజతం సాధించాడు. ఆసియా క్రీడల జట్టు స్వర్ణం కూడా సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో 35 ఏళ్ల దీపికా పల్లికల్‌తో జతకట్టనున్నారు. గోల్డ్‌కోస్ట్‌లో వీరిద్దరూ రజతం సాధించారు.

కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోష‌ల్ కాంస్యం నెగ్గడంతో అయనకు ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios