CWC Meeting: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, హింసను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలం.. ఖర్గే ఫైర్
హైదరాబాద్‌లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ అయింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి.

హైదరాబాద్‌లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ అయింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నేతృత్వంలో జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ మీటింగ్ ఇదే. తొలుత జెండా ఎగరవేసిన తర్వాతా సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్‌లో రగులుతున్న హింస, విస్తరిస్తున్న అసమానతల నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
భారతీయ జాతీయ కాంగ్రెస్ గత తొమ్మిదిన్నరేళ్లుగా సామాన్య ప్రజల ఆందోళనలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో నిబద్ధతతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇండియా కూటమి మూడు సమావేశాల విజయవంతం కావడంతో ప్రధాని మోదీ నుంచి, బీజేపీ నుంచి దాడుల తీవ్రమవుతాయని విమర్శించారు. ఇండియా కూటమి ముంబై సమావేశం తర్వాత ప్రతిపక్ష నాయకులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీలను మోహరించిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మణిపూర్ హింసాకాండ హర్యానాలోని నుహ్‌కు చేరుకోవడానికి అనుమతించిందని విమర్శలు గుప్పించారు. ఈ కారణంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో మత ఉద్రిక్తతలు వ్యాపించాయని అన్నారు.
ఈ సంఘటనలు ఆధునిక, ప్రగతిశీల, లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఖర్గే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ, మతోన్మాద సంస్థలు, మీడియాలోని ఒక విభాగం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను గుర్తించి బయటపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2021 జనాభా లెక్కలను నిర్వహించనందున.. 14 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతా చట్టంకు దూరమయ్యారని విమర్శించారు. 18 శాతం మంది ప్రజలు ఎంఎన్‌ఆర్‌ఈజీఏ నుంచి దూరంగా ఉన్నారని అన్నారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ వేతనాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు.
భారతదేశ భూభాగాన్ని చైనా అక్రమిస్తున్నప్పటికీ.. మోదీ ప్రభుత్వం మాత్రం చైనాకు క్లీన్‌చిట్ ఇస్తోందని మండిపడ్డారు. దేశ భద్రత పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించాలని అన్నారు. రేపటి సమావేశంలో రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల గురించి చాలా వివరంగా చర్చించనున్నట్టుగా, వ్యూహరచన చేయనున్నట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు కోట్లాది మంది స్నేహితులకు భవిష్యత్తు రాజకీయాల కోసం మనం సందేశం ఇవ్వాలని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భయంకరమైన ప్రకృతి విషాదం సంభవించిందని.. దానిని జాతీయ విపత్తుగా ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందించి పునర్నిర్మాణానికి సహకరించాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉందని.. ద్రవ్యోల్బణం పేద, సామాన్య ప్రజల జీవితాలకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణచివేయడానికి, ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఇక, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం వారు అక్కడి నుంచి తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు.