Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ. లక్షతో సోనీ టీవీ ఆర్డర్ చేస్తే.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే వచ్చిందేమిటంటే..

ఈ-కామర్స్  ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి టీవీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. తను ఆర్డర్ డెలివరీ చూసిన అతడు ఒకింత షాక్ తిన్నారు.

Customer Receives Thomson TV instead order Sony TV worth Rs 1 lakh from Flipkart ksm
Author
First Published Oct 26, 2023, 1:33 PM IST

ఈ-కామర్స్  ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి టీవీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. తను ఆర్డర్ డెలివరీ చూసిన అతడు ఒకింత షాక్ తిన్నారు. ఎందుకంటే.. అతడు రూ. లక్షతో సోనీ టీవీని ఆర్డర్ చేస్తే.. థామ్సన్ టీవీ డెలివరీ చేశారు. అయితే బాక్స్‌పై సోనీ టీవీ అని రాసి ఉంది. దీంతో ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తన సమస్యను ప్రస్తావించాడు. వివరాలు..  ఆర్యన్ పేరుతో ఉన్న ఎక్స్ యూజర్ ఓ పోస్టు చేశారు. తాను అక్టోబర్ 7వ తేదీన ఫ్లిప్‌కార్ట్ నుంచి సోనీ టీవీ ఆర్డర్ చేశానని చెప్పాడు. అయితే తనకు సోని అని రాసి ఉన్న బాక్స్ డెలివరీ అయిందని.. అందులో మాత్రం థామ్సన్ టీవీ ఉందని పేర్కొన్నారు

‘‘నేను అక్టోబరు 7న ఫ్లిప్‌కార్ట్ నుండి సోనీ టీవీని కొనుగోలు చేసాను. అది అక్టోబరు 10న డెలివరీ చేయబడింది. సోనీ ఇన్‌స్టాలేషన్ వ్యక్తి అక్టోబర్ 11న వచ్చాడు. అతడే స్వయంగా టీవీని అన్‌బాక్స్ చేశాడు. అయితే సోనీ బాక్స్‌లో థామ్సన్ టీవీని చూసి మేము షాక్ అయ్యాము. స్టాండ్, రిమోట్ మొదలైన ఉపకరణాలు లేవు’’ అని ఆర్యన్ పేర్కొన్నారు.

తక్షణమే ఫ్లిప్‌కార్ట్‌తో సమస్యను ప్రస్తావించినప్పటికీ.. రెండు వారాల తర్వాత కూడా ప్రాసెస్ చేయబడలేదని పేర్కొన్నారు. ‘‘ప్రారంభంలో వారు నాకు అక్టోబర్ 24న రిజల్యూషన్ తేదీని ఇచ్చారు. కానీ 20వ తేదీన వారు మొదట సమస్యను పరిష్కరించినట్లు చూపించారు. తరువాత నవంబర్ 1 వరకు తేదీని పొడిగించారు’’ అని తెలిపారు. దీంతో తాను మరింతగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారు. 

తాను టీవీ ఆర్డర్ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఎదురు చూశానని ఆర్యన్ తెలిపారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023ని కొత్త టీవీలో వీక్షించాలని భావించానని చెప్పారు. అయితే ఫ్లిప్‌కార్ట్ సేవలో లోపం, తప్పు చర్య.. తనను భరించలేని ఒత్తిడికి గురిచేశాయని పేర్కొన్నారు. 

అయితే ఈ పోస్టుపై స్పందించిన ఫ్లిప్‌కార్టు వినియోగదారునికి క్షమాపణలు చెప్పింది. ‘‘రిటర్న్ రిక్వెస్ట్‌తో మీరు ఎదుర్కొన్న ఇబ్బందికి మా ప్రగాఢ క్షమాపణలు. మేము మీ కోసం దీన్ని పరిష్కరించాలనుకుంటున్నాము. దయచేసి మీ ఆర్డర్ వివరాలతో మాకు డీఎం చేయండి. తద్వారా మీ వివరాలు ఇక్కడ గోప్యంగా ఉంటాయి’’ అని ఫ్లిప్‌కార్టు పేర్కొంది. ఈ పోస్ట్ అక్టోబర్ 25న షేర్ చేయగా.. ఇప్పటివరకు 2.1 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios