అడవిపందుల కోసం కరెంట్ ట్రాప్.. దాంట్లో చిక్కుకుని ఇద్దరు మృతి.. భయంతో పొలంలోనే పాతిపెట్టిన యజమాని....
పాలక్కాడ్‌లో అదృశ్యమైన ఇద్దరు యువకులు ఓ వరి పొలంలో పూడ్చిపెట్టి, మృతదేహాలుగా దొరికారు. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ కంచె వల్ల వారిద్దరూ చనిపోయారు. దీంతో భయపడ్డ భూమి యజమాని వారి మృతదేహాలను పూడ్చిపెట్టాడు.

పాలక్కాడ్ : కేరళలోని పాలక్కాడ్ లో ఓ ఇద్దరు యువకులు తప్పిపోయారు. మంగళవారం (సెప్టెంబర్ 26) వారిద్దరూ పాలక్కాడ్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోని కొడుంబలోని సెయింట్ సెబాస్టియన్ పాఠశాల సమీపంలోని కరీంగరపుల్లి దగ్గరున్న వరి పొలంలో మృతదేహాలుగా లభ్యమయ్యారు. తాజా నివేదికల ప్రకారం, భూమి యజమాని ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి యువకులు మరణించారు. దీంతో భయపడ్డ స్థలం యజమాని వారి మృతదేహాలను పొలంలోనే పాతిపెట్టాడు.
మృతులు పుదుస్సేరిలోని కలందితరకు చెందిన సతీష్ (22), కొట్టెక్కడ్‌లోని తెక్కెంకున్నంకు చెందిన షిజిత్ (22). నిందితుడు అంబలపరంబు వీట్టిల్ అనంతన్ (52). పొలంలో ఓ చోట ఏదో లాక్కెళ్లినట్టుగా గుర్తులు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం ప్రకారం కసబా పోలీసులు తరువాత మృతదేహాలను ఒక ప్రదేశం నుండి వెలికితీశారు.
ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మహిళపై పోలీసుల సామూహిక అత్యాచారం..
విచారణ పూర్తయిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించనున్నారు. వారి మరణానికి కారణమైన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గొయ్యి నుంచి బయటకు తీసిన తర్వాత మృతదేహాలను ఒకదానిపై ఒకటి పెట్టారు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత వాటికి బట్టలు లేకపోవడం గమనించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. గత ఆదివారం రాత్రి వేనోలిలో ఓ ముఠాతో వాగ్వాదం జరగడంతో కసబా పోలీసులు సతీష్, షిజిత్, వారి స్నేహితులు అభిన్, అజిత్‌లపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నలుగురూ సతీష్ బంధువు అంబలపరంబు ఇంటికి వచ్చారు. బంధువుల ఇంటికి పోలీసులు వచ్చి పట్టుకుంటారేమోనన్న భయంతో మంగళవారం ఉదయం పొలంలోకి దూకి పారిపోవడానికి ప్రయత్నించారు.
సతీష్, షిజిత్ ఓ వైపు.. అభిన్, అజిత్ వారికి వ్యతిరేక దిశలో మరోవైపు పారిపోయారు. తర్వాత అభిన్, అజిత్‌లు వేనోలికి చేరుకున్నారు, అయితే మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. తమ ఫోన్ లకు సమాధానం రాకపోవడంతో కసాబా పోలీసులకు మిస్సింగ్ రిపోర్టు ఇవ్వాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. వారి అన్వేషణలో, పోలీసు బృందం వరి పొలంలో చెదిరిన మట్టిని కనుగొన్నారు. అక్కడ మట్టిని తవ్వగా మృతదేహం శరీరభాగాలు కనిపించాయి.