Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి భద్రతాలోపం అంటూ కాంగ్రెస్ ఫిర్యాదు.. ఆయనే నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ సీరియస్ రియాక్షన్

రాహుల్ గాంధీకి భద్రతా లోపం అంటూ బుధవారం కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. ఈ రోజు సీఆర్‌పీఎఫ్ దీనిపై స్పందించింది. భద్రతా బలగాలు కచ్చితత్వంతో సెక్యూరిటీ గైడ్‌లైన్స్ పాటించాయని, కానీ, రాహుల్ గాంధీనే వాటిని ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
 

crpf rebuttal to congress after its allegations of security breaches in rahul gandhi bharat jodo yatra in delhi leg
Author
First Published Dec 29, 2022, 12:53 PM IST

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీకి ఢిల్లీలో భద్రతా లోపం ఏర్పడిందని, కేంద్ర బలగాలు తగిన రక్షణ కల్పించలేవని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా సీఆర్‌పీఎఫ్ స్పందించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే చాలా సార్లు భద్రతాపరమైన గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారని వివరించింది.

రాష్ట్ర పోలీసులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయంలో సీఆర్‌పీఎఫ్ రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. డిసెంబర్ 24వ తేదీ రాహుల్ గాంధీ కార్యక్రమం కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ లయేషన్‌ను రెండు రోజుల ముందే నిర్వహించిందని వివరించింది. ప్రధాన కార్యక్రమాల్లో వీఐపీల సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ ఏజెన్సీలు ఇలా అడ్వాన్స్ సెక్యూరిటీ లయేషన్ చేపడుతాయి.

కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటి రోజులో కూడా తాము కచ్చితత్వంతో సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను పాటించామని సీఆర్‌పీఎఫ్ స్పష్టం చేసింది. ఆ రోజు సరిపడా బలగాలను మోహరించినట్టూ ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చామని వివరించింది.

రాహుల్ గాంధీపై సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ ఆరోపణలు చేసింది. భద్రత కల్పించిన వ్యక్తి కూడా సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌న పాటిస్తే ఆ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉంటుందని వివరించింది. కానీ, రక్షణ కల్పించిన వ్యక్తే గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తే ఎలా అని, రాహుల్ గాంధీ చాలా సార్లు ఇలా ఉల్లంఘించారని, వాటి గురించి ఎప్పటికప్పుడు ఆయనకు తెలియజేశామని తెలిపింది.

Also Read: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రానికి లేఖ..

2020 నుంచి రాహుల్ గాంధీ 113 సార్లు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. ‘భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత కూడా ఆయన సెక్యూరిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించారు. దాన్ని సీఆర్‌పీఎఫ్ ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటున్నది’ అంటూ తెలిపింది. 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై ఆ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భద్రతలో అనేక ఉల్లంఘనలు జరిగాయని లేఖలో పేర్కొంది. రాహుల్ గాంధీకి సరైన రక్షణ కల్పించాలని కోరింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాసిన ఈ లేఖలో..  డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించినప్పటి నుంచి యాత్రకు సంబంధించి భద్రతపై పలుమార్లు రాజీ పడ్డారని పేర్కొన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్ గాంధీ చుట్టూ పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంతో ఢిల్లీ పోలీసులు పూర్తిగి విఫలమయ్యారని ఆరోపించారు. కాగా, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారనే సంగతి తెలిసిందే. 

ఢిల్లీ పోలీసులు భద్రత ఉల్లంఘనలు జరుగున్న సమయంలో మూగ ప్రేక్షక పాత్ర పోషించడంతో.. పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి చుట్టూ వలయాన్ని ఏర్పాటు చేశారని కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీకి  మెరుగైన భద్రతను కోరుతూ.. కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సహా పలువురు హత్యలను కూడా లేఖలో ప్రస్తావించారు.

Follow Us:
Download App:
  • android
  • ios