Indian CRPF Jawan Marrying Pakistani Woman: పెళ్లి... అది సాదాసీదా విషయం కాదు. ఓ భారత జవాన్, ఓ పాకిస్తానీ యువతితో ప్రేమలో పడితే? అది దేశ భద్రతను కదిలించే అంశంగా మారితే? ఇది సినిమాలా ఊహించిన కథల అనిపిస్తుంది కదా.. కానీ ఇది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. పాకిస్తాన్ అమ్మాయి, భారత సీఆర్‌పీఎఫ్ జవాన్ వీడియో కాల్ పెళ్లి.. భారత్ లో కాపురం పెట్టిన స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Indian CRPF Jawan Marrying Pakistani Woman: జమ్మూ జిల్లాలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన మీనల్ ఖాన్ కు ఆన్లైన్‌లో పరిచయమై ప్రేమలో పడ్డాడు. 2024 మే 24న వీడియో కాల్ ద్వారా పెళ్లి (నిఖా) చేసుకున్నాడు. ప్రేమకు సరిహద్దులు ఉండవు అనే నమ్మకంతో చేసిన ఈ వివాహం, అతని జీవితాన్ని తలకిందుల చేసింది. ఈ లవ్ స్టోరీ కొత్త మలుపు తిరిగింది.
మీనల్ ఖాన్ ఫిబ్రవరి 28న భారతదేశంలోకి షార్ట్ టర్మ్ వీసాతో ప్రవేశించింది. కానీ ఆమె వీసా మార్చి 22న ముగిసింది, అయినా దేశం విడిచి వెళ్ళలేదు. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోవడంతో భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులపై కఠిన చర్యలు తీసుకుంటూ వారిని వెనక్కు పంపాలనే నిర్ణయం తీసుకుంది. ఈ చర్యల మధ్య మునీర్ అహ్మద్, మీనల్ ఖాన్ వివాహం వెలుగులోకి వచ్చింది. అతన్ని సీఆర్పీఎఫ్ విధుల నుంచి తొలగించింది.
సీఆర్‌పీఎఫ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మునీర్ తన పెళ్లిని గోప్యంగా ఉంచాడు. మీనల్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్ లోనే ఉంచడంతో అతనిపై కఠిన చర్య తీసుకున్నారు. "ఇది దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది" అని సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఎం. ధినకరన్ తెలిపారు. అందుకే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
అయితే, మునీర్ మాత్రం ఇది అన్యాయమనీ, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఒక జవాన్ గా తనకు న్యాయం చేయడంలో కలుగజేసుకోవాలని కోరుతున్నాడు. "2022 డిసెంబర్ 31ననే నేను మా పెళ్లి విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారులకు తెలియజేశాను. అవసరమైన పాస్‌పోర్ట్, పెళ్లి సర్టిఫికేట్, నాకూ, మా తల్లిదండ్రులకూ చెందిన అఫిడవిట్లు సమర్పించాను. 2024 ఏప్రిల్ 30న హెడ్‌క్వార్టర్స్ నుంచి పెళ్లికి అనుమతి కూడా వచ్చింది" అని చెబుతున్నాడు.
పెళ్లి అనంతరం తన 72వ బటాలియన్‌లో డాక్యుమెంట్లు సమర్పించిన మునీర్, మీనల్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమెకు లాంగ్ టర్మ్ వీసా కోసం అప్లై చేసినట్టు కూడా చెప్పాడు. అంతేకాదు, మార్చి 25న సుందర్‌బానీలో రిపోర్ట్ చేసిన తరువాత, 27న అనూహ్యంగా భోపాల్‌లోని 41వ బటాలియన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాననే విషయాలు ప్రస్తావిస్తున్నాడు. 15 రోజుల జాయినింగ్ గ్యాప్ లేకుండా మార్చి 29న చేరాలని ఆదేశించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నానని వివరించాడు.
అక్కడ అధికారులతో ఇంటర్వ్యూలు జరిగాయనీ, తన పెళ్లిని స్పష్టంగా ప్రకటించి డాక్యుమెంటేషన్ పూర్తిచేశానని మునీర్ చెప్పాడు. అయినా తనపై చర్యలు తీసుకోవడం తగదనీ, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కాగా, ఈ కేసులో మినల్ ఖాన్‌ను దేశం వీడాలనే ఉత్తర్వులను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు నిలిపివేసింది. ఆమెకు 10 రోజుల పాటు భారత్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. తనను ఉద్యోగం లోకి తీసుకోకపోతే కోర్టులో న్యాయ పోరాటం చేయాడానికి కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. సీఆర్పీఫ్ ఉద్యోగంతో సాఫీగా జీవితం సాగుతున్న క్రమంలో పాక్ యువతితో ప్రేమతో మొదలైన ప్రయాణం ఊహించని పరిణామాల మధ్య చివరకు అతని ఉద్యోగం పోవడంతో పాటు న్యాయ పోరాటంలోకి మారింది.
