సారాంశం
పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా తలపై ఒక కాకి తన్నింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా తలపై ఒక కాకి కాలితో తన్నింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన రాఘవ్ చద్దా.. పార్లమెంట్ ఆవరణలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక కాకి అతనిపై దాడి చేసింది. దీంతో ఆయన కాస్తా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ పరిణామంపై స్పందించిన బీజేపీ.. రాఘవ్ చద్దాపై విమర్శలు గుప్పించింది.
ఢిల్లీ బీజేపీ యూనిట్.. రాఘవ్ చద్దా తలపై కాని తన్నుతున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘అబద్ధాలు ఆడేవారిని కాకి కరుస్తుంది. ఈ రోజు వరకు మేము విన్నాను.. ఈ రోజు కూడా అబద్ధాల కోరును కాకి కరిచినట్లు చూశాం!’’ అని ట్వీట్ చేసింది.
బీజేపీ నాయకుడు తేజిందర్ పాల్ సింగ్ బగ్గా కూడా రాఘవ్ చద్దా తలపై తన్నుతున్న ఫోటోను ట్వీట్ చేసి ఆయనపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘‘గౌరవనీయ ఎంపీ రాఘవ్ చద్దా జీపై కాకి దాడి చేసిన వార్తతో నా హృదయం చాలా బాధగా ఉంది. మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.