ఉక్రెయిన్, రష్యాకు మధ్య నెలకొన్న యుద్ధం పరోక్షంగా అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. ఈ వార్ వల్ల మన దేశంలో ఎల్పీజీ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉక్రెయిన్, రష్యా కు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతోంది. ఆ రెండు దేశాల నుంచి వివిధ వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ పై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా పడుతోంది. ఈ యుద్ధం వల్లే మన దేశంలో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో నిత్యావసర వస్తువు ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది.
భారత్ ఎక్కువగా ముడి చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అయితే ఉక్రెయిన్ , రష్యాకు ఏర్పడిన వార్ ప్రభావం వల్ల ఈ ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. పరోక్షంగా ఇది మన వంటింటిపై ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ ధరలు ఒక్క సారిగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా వెయ్యి రూపాయిలకు చేరుకుంటుందని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయొచ్చని నిపుణులు చెపుతున్నారు.
అయితే ఎల్పీజీ ధరల పెరుగుదలకు సంబంధించిన విషయం ఇంకా అధికారికంగా తెరపైకి రాలేదు. కానీ ప్రభుత్వ అంతర్గత అంచనా ప్రకారం వినియోగదారుడు సిలిండర్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కాగా డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం రెండు విధానాలు అవలంబించవచ్చనే చర్చ కూడా సాగుతోంది.ఇందులో మొదటిది ఏంటంటే వినియోగదారులకు సబ్సిడీ లేకుండా సిలిండర్లు సరఫరా చేయాలి లేదా కొంత మంది వినియోగదారులకు మాత్రమే సబ్సిడీని అందించాలి.
ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ?
ఈ ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన సూచన రాలేదు. అయితే పది లక్షల రూపాయల వార్షికాదాయం నిబంధనను అమలులో ఉంచుతారని అంతర్గతంగా చర్చ సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం ఇవ్వనున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ఇతర వినియోగదారులకు సబ్సిడీలు అందకపోవచ్చు.
గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. గతేదాడి మొత్తంగా సిలిండర్ల ధర నిరంతరం పెరుగుతూనే వచ్చింది. వాస్తవానికి 2015 జనవరిలో నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ రావడం ప్రారంభమైంది. అంటే వినియోగదారుడు ముందుగా గ్యాస్ సిలిండర్ కు అవసరమైన మొత్తాన్ని చెల్లించాలి. తరువాత సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ మొత్తాన్ని జమచేసేవారు. దీంతో ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ల అక్రమ వినియోగాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వ భావన. కానీ ఈ సబ్సిడీ వినియోగదారుడి అకౌంట్లో సరిగా జమకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా ఎల్పీజీపై సబ్సిడీ వస్తుండటం గమనార్హం. 2021 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీపై కింద ప్రభుత్వం రూ.3559 కు అందజేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం రూ.24 వేల 468 కోట్లుగా ఉంది.
