పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ క్రిమినల్ రెండో అంతస్తులో ఉన్న బాత్రూమ్ కిటికీ లో నుండి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగింది. 

ఇటీవల పోలీసులపై కాల్పులకు తెగబడిన మహ్మద్ ఇమ్రాన్ కోసం పోలీసు శాఖ తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో నేరస్థుడు ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఇమ్రాన్ ఇద్దరు బావమరుదులు ల‌క్మాన్‌, చాంద్ మ‌హమ్మ‌ద్‌లు  పట్టుబడ్డారు.

వారిని ఇమ్రాన్ ఆచూకీ కోసం విచారణ చేస్తుండగా.. చాంద్ మహ్మద్ బాత్రూంకి వెళ్ళాలని పోలీసులకు చెప్పి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. 

దీనికోసం బాత్రూం కిటికీలో నుంచి కిందికి దూకాడు. అయితే చాంద్ ఉన్నది రెండో అంతస్తు కావడంతో.. అంత ఎత్తునుంచి కింద పడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాంద్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

గ్రేటర్ నోయిడా డిసిపి రాజేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని చెబుతూ, చాంద్ మీద అర డజనుకు పైగా దొమ్మి,హత్య కేసులు ఉన్నాయని, ఇన్స్పెక్టర్ అక్తర్ ఖాన్ హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడని వెల్లడించారు.