New Delhi: 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) కు దాదాపు 31,000 ఫిర్యాదులు అందాయి. అయితే, అంతకుముందు ఏడాది 30,864 ఫిర్యాదులు అందాయి. అత్యధికం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాయి.
National Commission for Women (NCW): దేశంలో మహిళలపై నేరాలు, హింస పెరుగుతున్నదని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆందోళన వ్యక్తం చేసింది. 2014 తర్వాత మళ్లీ 2022 లో దేశంలోని మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన అత్యధిక ఫిర్యాదులు అందుకున్నట్టు పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. మహిళలపై నేరాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) 2022 లో దాదాపు 31,000 ఫిర్యాదులు అందుకుంది. ఇది 2014 తర్వాత అత్యధికం. ఈ ఫిర్యాదుల్లో అత్యధికం మానసిక వేధింపులు, గృహ హింసకు సంబంధించినవి ఉన్నాయని మహిళా కమిషన్ పేర్కొంది. 2021లో జాతీయ మహిళా కమిషన్ కు 30,864 ఫిర్యాదులు రాగా, 2022లో ఈ సంఖ్య 30,957కు పెరిగింది. మొత్తం 30,957 ఫిర్యాదుల్లో 9,710 మహిళల మానసిక వేధింపులను పరిగణనలోకి తీసుకుని గౌరవంగా జీవించే హక్కుకు సంబంధించినవి కాగా, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు 6,970, వరకట్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు 4,600 ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు..
54.5 శాతం (16,872) ఫిర్యాదులు అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చాయి. ఢిల్లీలో 3,004, మహారాష్ట్రలో 1,381, బీహార్లో 1,368, హర్యానాలో 1,362 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్సీడబ్ల్యూ డేటా ప్రకారం, గౌరవంగా జీవించే హక్కు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు ఉత్తర ప్రదేశ్ నుండి అత్యధిక సంఖ్యలో వచ్చాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరానికి సంబంధించి 2,523 ఫిర్యాదులు, 1,701 అత్యాచారం, అత్యాచార ప్రయత్నానికి సంబంధించినవి, 1,623 ఫిర్యాదులు మహిళలపై పోలీసుల ఉదాసీనతకు సంబంధించినవి, 924 సైబర్ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి.
ఎన్సీఆర్బీ డేటా..
సెప్టెంబర్ 2022 ఎన్సీఆర్బీ డేటాను ఉటంకిస్తూ, మహిళా సంబంధిత నేరాలలో శిక్షల సంఖ్యలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. మహిళలకు సంబంధించిన నేరాల్లో 7,713 మంది దోషులుగా తేలగా, సైబర్ నేరాల్లో 292 మంది దోషులుగా తేలారు. ఐపీసీకి సంబంధించిన నేరాలకు సంబంధించి మొత్తం 1,12,800 మందిని దోషులుగా నిర్ధారించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2021లో దేశంలో మహిళలపై నేరాల కింద 4,28,278 కేసులు నమోదు కాగా, యూపీలో 56,083 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం అత్యాచారాల సంఖ్య 31,677 కాగా, యూపీలో ఈ సంఖ్య 2,845గా ఉంది. దేశంలో క్రైమ్ రేటు 4.8గా ఉంది.
