ముంబై: శివసేన చీఫ్  ఉద్ధవ్ ఠాక్రే  బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో గోవులకు రక్షణ ఉంది, కానీ, మాతలకు రక్షణ లేదా అని ఆయన ప్రశ్నించారు. గోవుల రక్షణ పేరుతో మూకుమ్మడి దాడులు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గోవుల రక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న గుంపు దాడులు, మూక హత్యలు, మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రపంచంలోనే మహిళలకు  రక్షణ లేని దేశంగా ఇండియా మారిపోతోందని  ఆయన ఆరోపణలు చేశారు.

దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోవులను రక్షించుకోవడం మంచిదేనని చెప్పారు. అయితే మాతల రక్షణ విషయం గురించి ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.  శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఉద్దవ్ ఠాక్రే  బీజేపీపై నిప్పులు చెరిగారు.

మేము ప్రభుత్వంలో భాగస్వామ్యులమే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము  భారత ప్రజలకు స్నేహితులం. అంతే కానీ ఏ పార్టీకి స్నేహితులం కాదని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

దేశంలో మహిళల కంటే ఆవులకే భద్రత ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. గో రక్షణ పేరిట గోవులను కాపాడేదానికంటే బీఫ్‌​ ఎవరు తింటున్నారు, ఎవరు తినడం లేదు అనే దానిపైనే కొంత మంది దృష్టి పెడుతున్నారని విమర్శించారు. 

ఇదే హిందుత్వం అంటే నేను అంగీకరించనన్నారు.  ఎవరు జాతీయ వాదులు,ఎవరు కాదో నిర్ణయించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయవాదులు కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం(యూపీఏ) చేసిన తప్పిదాలనే ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.