హర్యానాలో మత పరమైన ఘర్షణలు చెలరేగిన రోజు ఆయుధాలు కలిగి ఉన్నాడనే కారణంతో గోరక్షకుడు బిట్టు బజరంగీని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యారు. తాజా కేసులో మళ్లీ ఆయనను నుహ్ పోలీసులు అరెస్టు చేశారు.
హర్యానాలో జూలై 31న మత ఘర్షణలకు ముందు రెచ్చగొట్టే వీడియో పోస్ట్ చేసినందుకు అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన భజరంగ్ దళ్ సభ్యుడు, గోరక్షకుడు బిట్టు బజరంగీని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. హింస జరిగిన రోజు ఆయన అల్లర్లకు పాల్పడ్డారని, ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నుహ్ పోలీసులు మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజ్ కుమార్ అలియాస్ బిట్టు ఫరీదాబాద్ లోని తన ఇంట్లో ఉన్న సమయంలో సాదాసీదా దుస్తులు ధరించిన 10-12 మంది నుహ్ పోలీసుల బృందం హడావిడిగా అక్కడి వచ్చింది. స్థానికులు చూస్తుండగానే తుపాకులు, లాఠీలతో వారంతా వచ్చి బిట్టు ఇంట్లోకి వెళ్లారు. అంతే వేగంగా ఆయనను బయటకు తీసుకొచ్చి, తమ వెంట పట్టుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిని వార్తా సంస్థ ‘పీటీఐ’ కూడా పోస్ట్ చేసింది. ఏఎస్పీ ఉషా కుందు ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.
నుహ్ లోని సదర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 31 న నుహ్ గుండా వెళుతున్న మతపరమైన యాత్రకు ముగింపు ప్రదేశం అయిన నల్హర్ ఆలయంలో ఏఎస్పీ కుందు విధుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో బిట్టుతో పాటు 15-20 మంది అతడి అనుచరులు కత్తులు, త్రిశూలాలతో ఆలయానికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు రెచ్చిపోయి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమ వాహనంలో ఎక్కించుకున్నారు.
అయితే బిట్టు, అతడి మద్దతుదారులు పోలీసు వాహనం వెనుక కిటికీ తెరిచి ఆయుధాలతో పరారయ్యారు. దీంతో 45 ఏళ్ల బిట్టు, గుర్తు తెలియని నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా.. మతపరమైన ఊరేగింపు సమయంలో సాయుధ మూకలు పోలీసులు, యాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేశాయి. ఈ ఘర్షణ వార్తలు గుర్గావ్, పల్వాల్ తదితర జిల్లాల్లో మత ఘర్షణలకు దారితీశాయి.
ఇదిలా ఉండగా.. జూలై 31న నిర్వహించిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర సందర్భంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన 'తుమ్హరా జీజా ఆ రహా హై (మీ బావ వస్తున్నాడు)' అనే రెచ్చగొట్టే ఫేస్ బుక్ వీడియోను పోస్ట్ చేసినందుకు ఆగస్టు 2న బిట్టును ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గోరక్షక నాయకుడు మోహిత్ యాదవ్ అలియాస్ మోను ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఎంతో ఆవేశంగా చేసిన ఆయన ఈ ప్రసంగం చేశారు. దీని వల్ల ప్రతీకార వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. తరువాత అది మత ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని భివానీలో ఎస్ యూవీలో కాలిపోయిన నాసిర్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో మోను నిందితుడిగా ఉన్నాడు. అతడిని ఇంకా అరెస్టు చేయలేదు.
