చిన్నారిపై ఆవు దాడి చేసిన ఘటన తీవ్ర భయాందోళనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆవు యజమానికి పోలీసులు అరెస్ట్ చేశారు. 

చెన్నై : తమిళనాడులో కలకలం రేపిన స్కూలు నుంచి వస్తున్న చిన్నారిపై ఆవుదాడి ఘటనలో ఆ ఆవు యజమానికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆవుదాడిలో గాయపడిన 4వ తరగతి విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది.

చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతుండగా ఆవు దాడి చేయడంతో, ఆవు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మొత్తం ఈ వీధిలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ నాలుగు నిమిషాల వీడియోలో 9 ఏళ్ల ఆయిషా అనే బాలికపై ఆవు దారుణంగా దాడి చేసింది. కొమ్ములతో కుమ్ముతూ..భయబ్రాంతులకు గురి చేసింది.

చిన్నారి పాపను కొమ్ములతో కుమ్మిన ఆవు.. కిందపడేసి కడుపులో కాళ్లతో తొక్కి.. ఒళ్లు జలదరించే వీడియో ఇదే

ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బాలిక చికిత్స పొందుతోంది. ఆయిషా బుధవారం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఓ వీధిలో తనముందు వెడుతున్న ఆవు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వెన్నులోంచి వణుకు మొదలవుతోంది. ఈ వీడియోలో, ఆవు పదేపదే పిల్లవాడిపై దాడి చేస్తూ, తన కొమ్ములతో ఆమెను పైకి లేపి నేలపై పడవేయడం కనిపిస్తుంది.

బాలిక, ఆమె తల్లి అరుపులు విన్న చుట్టుపక్కలవారు ఆమెకు సహాయం చేయడానికి ఇళ్ల నుండి బయటకు వచ్చారు. కొంతమంది ఆవుపై రాళ్లు, కర్రలు విసిరి, అరుస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఆవు భయపడకుండా.. ఎంతగా అదలించినా వెల్లకుండా చిన్నారిపై దాడి చేస్తూనే ఉంది. 

ఒకానొక సమయంలో, ఆవు బాలికను వదిలి దూరంగా వెళ్లింది. మళ్లీ వెంటనే వెనక్కి తిరిగి బాలికపై దాడి చేసింది. ఓ స్థానికుడు కర్రతో వెంబడించడంతో ఆవు పారిపోయింది. బాలిక రక్షించబడింది. ఆవు దాడిలో తీవ్రంగా గాయపడడంతో బాలిక లేచి, నిలబడడానికి కూడా కష్టమయ్యింది. వెంటనే ఆ 4వ తరగతి విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో షాక్‌కి గురి చేయడంతో తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఆమెను పరామర్శించారు.

ఆవు యజమానిపై నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కేసు నమోదు చేసినట్లు అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌ పోలీసు అధికారి తెలిపారు. "మేం దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది బెయిలబుల్ కేసు" అన్నారాయన. వీడియోలో కనీసం నాలుగు పశువులు కనిపిస్తున్నాయి. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, యజమానికి రూ. 2,000 జరిమానా విధించారు.