చెన్నైలో ఓ చిన్నారి పాపను వీధిలో నడుచుకుంటూ వెళ్లుతున్న ఆవు దారుణంగా దాడి చేసింది. కొమ్ములతో పాపను ఎత్తి పడేసింది. కాళ్లతో తొక్కేసింది. తలతో నేలపైనా ఇష్టం వచ్చినట్టుగా పాపను గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. ఓ చిన్నారి పాపను ఆవు దారుణంగా దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఆమెను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంటి సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. స్థానికులు ఆ ఆవును అదలకొట్టే ప్రయత్నం చేశారు. కానీ, సులువుగా ఆ బాలికను వదిలిపెట్టలేదు.
ఈ ఘటన చెన్నైలోని ఎంఎండీఏ కాలనీలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
6వ తరగతి చదువుతున్న అయేషాకు తమ్ముడు ఉన్నాడు. స్కూల్ వెళ్లిన అయేషా, ఆమె తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి వచ్చింది. వారిద్దరినీ నడిపించుకుంటూ తల్లి ఇంటికి తీసుకువస్తున్నది. ఇంతలో ఓ వీధిలో వారి ముందు ఓ ఆవు, ఆవు దూడ నడుచుకుంటూ వెళ్లుతున్నాయి. ఆ సమయంలో అయేషా తమ్ముడు ఊరికే అల్లరిగా అరుస్తూ చేతులు ఊపాడు. వెంటనే ఆ ఆవు వెనుదిరిగి ముందే ఉన్న అయషాపై దాడి చేసింది.
Also Read: మోడీపై వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి అధిర్ రంజన్ చౌదరి సస్పెండ్, ఆ నివేదిక వచ్చే వరకు
కొమ్ములతో అయేషాను అమాంతం గాల్లోకి ఎత్తేసి పక్కనే పడేసింది. పలుమార్లు కొమ్ములతో దాడి చేసింది. కింద పడిపోయిన ఆమెను ఆ ఆవు దాని తలతోనే నేలపై అటూ ఇటూ నెట్టేసింది. ఆమె పై కాళ్లు వేసీ దాడి చేసింది. తల్లి హతాశయురాలైంది. కొడుకును దగ్గరకు తీసుకుని కాపాడండి అంటూ కేకలు పెట్టింది. ఆ ఆవును వెళ్లగొట్టాలని అరిచింది. అరుపులు విని చుట్టుపక్కల ఉన్నవారూ బయటకు వచ్చారు. ఆవును వెళ్లగొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరైతే రాళ్లతో ఆ ఆవును వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఓ వ్యక్తి కట్టెతో దాని మీదికి ఉరికి ఉరికి వెళ్లాడు. అప్పుడు ఆ ఆవు అక్కడి నుంచి బాలికను నేలపైనే వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది.
