దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుంటే.. ప్రజల్లో భయం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఓ భర్త తాను కట్టుకున్న భార్యను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని బెంగళూరులో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. చండీగఢ్‌ నుండి తిరిగి వచ్చిన భార్యను భర్త ఇంట్లోకి రానివ్వ‌లేదు. కరోనా వైరస్ భయం కార‌ణంగా ఆమెను ఇంటిలోనికి వ‌చ్చేందుకు అనుమ‌తించ‌లేదు. 

దీంతో ఆమె తాను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటాన‌ని చెప్పింది. అయినా స‌రే భార్య‌ను లోనికి రానివ్వ‌లేదు. ఆమె లాక్‌డౌన్‌కు ముందు చండీగఢ్‌లోని తన పుట్టింటికి వెళ్లి, అక్క‌డ చిక్కుకుంది.

 అయితే వారి పదేళ్ల కుమారుడు బెంగళూరులో తండ్రి వ‌ద్ద‌నే ఉన్నాడు. మూడు నెలల తరువాత ఆమె ఇంటికి వచ్చింది. త‌న భ‌ర్త సంతోషంతో త‌న‌ను లోనికి ఆహ్వానిస్తాడ‌ని భావిస్తే, చేదు అనుభ‌వం ఎదుర‌య్యింద‌ని వాపోయింది. దీంతో ఆమె క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది. 

ఆమె దానిని భ‌ర్త‌కు చూపిద్దామ‌ని ఇంటికి తిరిగివ‌చ్చింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండ‌టంతో ఆమె పోలీసులను ఆశ్ర‌యించింది. వారు ఆమెతో ప్ర‌స్తుతానికి బంధువుల ఇంటికి వెళ్లాల‌ని, కేసు ద‌ర్యాప్తు చేస్తామ‌ని చెప్పి, ఆమెను పంపివేశారు.