పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రాకముందే  టీఎంసీ అభ్యర్ధి కరోనాతో మరణించారు. 

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రాకముందే టీఎంసీ అభ్యర్ధి కరోనాతో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఖర్ధాహ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాజల్ సిన్హా కరోనాతో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన కరోనాకు చికిత్స పొందుతున్నారు. కోల్‌కత్తాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఆయన మరణించారు. 

ఈ నెల 22వ తేదీన ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం పూర్తైన తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. తన జీవితాంతం ప్రజల కోసం కాజల్ సిన్హా పనిచేశారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని మమత అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు. ఈ నెలలో జంగిపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన ఆర్‌ఎస్పీకి చెందిన అభ్యర్ధి ప్రదీప్ కుమార్ నంది కరోనాతో చనిపోయారు. షంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి రెజిల్ కూడ మరణించారు.