దేశం ఒకవైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త ఫంగస్‌లు ప్రభుత్వానికి, జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లోని  సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌‌కు కోవిడ్ సోకడంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు డాక్టర్లు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించారు. శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు.

Also Read:ఉచిత విద్య, స్టైఫండ్, ఆరోగ్య బీమా: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం చేయూత

కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల  వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి మెదడు సమీపంలో ఈ ఫంగస్‌ ఉందని, ఇప్పటికే ఆయన దవడలో సగభాగం తీసేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 12వేల పైచిలుకు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. అక్కడక్కడా వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి.