నేటి నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోస్ (మూడో డోసు) వేసేందకు కేంద్రం అనుమతించింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. అయితే బూస్టర్ డోస్ తీసుకునేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే..

నేటి నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు బస్టూర్ డోస్ (మూడో డోసు) వేసేందకు కేంద్రం అనుమతించింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారో.. మూడో డోసుగా కూడా దానినే పొందాలని కేంద్రం స్పష్టం చేసింది. 18 ఏళ్ల వయసు కలిగి రెండో డోసు తీసుకుని కనీసం 9 నెలలు ( 39 వారాలు లేదా 273 రోజులు) బూస్టర్ డోసు పొందడానికి అర్హులుగా కేంద్రం పేర్కొంది. బూస్టర్‌ డోసు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ లేదా వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ ద్వారా పొందవచ్చు.

మూడో డోసు పొందడానికి మళ్లీ ప్రత్యేకంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ ప్రోటోకాల్‌ను అనుసరించి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారి రికార్డును వ్యాక్సినేటర్ గుర్తించి.. వివరాలను ధ్రువీకరించుకుని ఆ వివరాలను కోవిన్ యాప్‌లో నమోదు చేయాలని కేంద్రం తెలిపింది. 

కొవిడ్‌ టీకా ప్రికాషన్‌ డోస్‌ ధరలను భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు తగ్గించాయి. సీరంకొవిషీల్డ్‌ ధర రూ. 600గా ఉండగా.. రూ. 225కు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ట్విటర్‌లో ప్రకటించారు. కొవ్యాక్సిన్‌ ధరను రూ. 1,200 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా శనివారం ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. 

ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్‌లు వ్యాక్సిన్ ధరతో పాటు.. సర్వీస్ ఛార్జీగా ఒక్కో డోసుకు గరిష్టంగా రూ.150 వరకు మాత్రమే వసూలు చేయాలని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రికాషన్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ధర రూ. 375లోపే ఉండనుంది. గతంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లు టీకా సైట్‌లను నిర్వహించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. భారతదేశంలో ఈ ఏడాది జనవరి 10న ఫ్రంట్‌లైన్ వర్కర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషస్ డోసులను అందించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక, మార్చి 16న ప్రికాషస్ డోస్ టీకా డ్రైవ్ 60 ఏళ్లు పైబడిన పెద్దలందరికీ విస్తరించబడింది.