కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు.. వ్యాక్సిన్ అందజేస్తున్నారు. మొన్నటి వరకు 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేశారు. ఆ తర్వాత 18ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టారు.

అయితే.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో 18-44 ఏజ్ గ్రూప్ వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఆపేశారు.  వ్యాక్సిన్ షార్టేజ్ కారణంగా.. వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ఆపేశారు. కేవలం 45 సంవత్సరాలు నిండినవారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేస్తుండటం గమనార్హం.

మహారాష్ట్ర బుధవారం (మే 12, 2021) తన మూడవ దశ టీకాల డ్రైవ్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.ఇక ఢిల్లీ ప్రభుత్వం సైతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల కోవాక్సిన్ నిర్వహణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది.


మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం కోవిడ్ -19 వ్యాక్సిన్ల సేకరణ కోసం గ్లోబల్ టెండర్లను ప్రకటించింది, తరువాత రాజస్థాన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు అడుగులేస్తోంది. 

ఇవి కాక ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ అవసరాలను తీర్చడానికి ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఎంచుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రం 20 లక్షల మోతాదుల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటుందని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.

సీరం ఇన్స్టిట్యూట్ మరియు భారత్ బయోటెక్ తమ ఉత్పత్తి ప్రణాళికను వచ్చే నాలుగు నెలల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఔషధ కంపెనీలు ఆగస్టు నాటికి వరుసగా 10 కోట్లు , 7.8 కోట్ల మోతాదు వరకు స్కేల్ చేయవచ్చని ప్రణాళిక సూచిస్తుంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్, పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా  కోవిషీల్డ్, ప్రస్తుతం కరోనావైరస్ కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క టీకాల డ్రైవ్‌లో ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ వ్యాక్సిన్ నిర్వహణ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ స్పందించారు. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ మందకోడిగా జరుగుతన్నప్పటికీ.. ఆయన సెకండ్ డోస్  గురించి మాట్లాడటం గమనార్హం. సెకండ్ డోస్ టీకా పంపిణీపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. కాగా.. ఇప్పటి వరకు 13.66కోట్ల మందికి ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ అందించగా.. రెండో డోస్ కేవలం 3.86కోట్ల మందికి మాత్రమే అందజేశారు. అందుకని.. రెండో డోస్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని  కేంద్ర మంత్రి హర్ష వర్థన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. తమ రాష్ట్రానికి టీకా సరఫరా సరిగాలేదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే చెప్పడం గమనార్హం. కరోనా వ్యాక్సిన్ ని కేంద్రం కంట్రోల్ చేస్తుందని.. అందుకే తమ రాష్ట్రానికి అందడం లేదని వారు పేర్కొన్నారు.  వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోందని పేర్కొన్నారు.