Bharat Biotech | క‌రోనా వైర‌స్ నిరోధించ‌డానికి రెండేండ్ల నుంచి 18 ఏండ్ల లోపు పిల్ల‌ల కోసం త‌యారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సుర‌క్షిత‌మేన‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని భార‌త్ బ‌యోటెక్ తెలిపింది. వైర‌స్ ప్ర‌భావాన్ని త‌ట్టుకోవ‌డంతోపాటు మెరుగైన రోగ నిరోధ‌క శ‌క్తిని క‌లిగి ఉంద‌ని చివ‌రిద‌శ టెస్ట్‌ల్లో తేలింద‌ని వెల్ల‌డించింది. 

Bharat Biotech | కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తూ..విల‌య‌తాండ‌వం చేస్తోంది. ల‌క్ష‌లాది మంది ప్రాణాలను హ‌రించింది. మ‌రోసారి విజృంభిస్తోంది. దీన్ని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఇప్ప‌టికే పెద్ద వారి నుండి టీనేజ్ పిల్ల‌ల వ‌ర‌కు టీకా పంపిణీ జ‌రుగుతోంది. అయితే.. 12 ఏళ్లలోపు పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. తాజాగా పిల్ల‌ల్లో కొవాగ్జిన్ టీకా ప‌నితీరుపై లాన్సెట్ జర్నల్ ప‌రిశోధ‌న‌లు చేసింది.

పిల్ల‌ల‌పై భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బిబిఐఎల్) తయారు చేసిన కోవాక్సిన్ ప‌నితీరు భేష్ అని లాన్సెట్ జ‌ర్న‌ల్ ప్రకటించింది. ఇది పిల్ల‌ల్లో అత్యంత సమర్థంగా పనిచేస్తుందని వెల్ల‌డించింది. 2 నుంచి 18 ఏళ్ల వారి మీద జరిగిన పరిశోధనల్లో కొవాగ్జిన్​ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా తేలిందని లాన్సెట్ వెల్లడించింది. 

కోవాక్సిన్ ఫేజ్ II, III ట్రయల్స్‌లో పిల్లలకు ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుందని నిరూపించబడిందని నివేదిక తెలిపింది. దీనిపై భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. 

డాక్టర్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడుతూ.. “పిల్లలకు వ్యాక్సిన్‌ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యమ‌నీ, ఈ డేటా పిల్లలకు టీకా యొక్క భద్రతను రుజువు చేసి వారి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నివేదించడాన్ని తాము సంతోషిస్తున్నామని తెలిపారు.పెద్దలు, పిల్లల కోసం సురక్షితమైన, ప్రభావవంతమైన COVID-19 వ్యాక్సిన్‌ను ప్రాథమిక రోగనిరోధకత, బూస్టర్ మోతాదుగా అభివృద్ధి చేయడం ద్వారా మరియు కోవాక్సిన్‌ను సార్వత్రిక వ్యాక్సిన్‌గా మార్చడం ద్వారా మేము మా లక్ష్యాన్ని సాధించామని తెలిపారు.

వ్యాక్సిన్‌లను నివారణ చర్యగా ఉపయోగించి నట్లయితే, అప్పుడు మాత్రమే వాటి శక్తిని ఉపయోగించుకోవచ్చుననీ, క్లినికల్ స్టడీలో ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని కంపెనీ తెలిపింది.

దుష్ప్రభావాల యొక్క మొత్తం 374 కేసులు నివేదించబడ్డాయి. వాటిలో చాలా వరకు చిన్నవి, ఇవి ఒక రోజులో పరిష్కరించబడ్డాయి. టీకాలు వేసిన ప్రదేశంలో నొప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న‌ కేసులు కనుగొనబడ్డాయి. తమ వద్ద 50 మిలియన్లకు పైగా కోవాక్సిన్ డోస్‌లు ఉన్నాయని, అవసరమైతే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ఫేజ్ 2,3 క్లినికల్ ట్రయల్స్​లోనూ పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో 1.7 రెట్లు సమర్థంగా కొవాగ్జిన్ ప‌ని చేస్తోంద‌ని లాన్సెట్ పేర్కొంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా పిల్లల్లో కొవాగ్జిన్ పనితీరుపై క్లీనికల్ ట్రయల్స్ జరపగా.. వాటి ఫలితాల ఆధారంగానే సర్కారు 6 నుంచి 18 ఏళ్ల వారికి టీకా అందించేందుకు అనుమతులు జారీ చేసింది.