న్యూఢిల్లీ: కరోనాపై కొత్త మ్యూటేషన్లపై భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా  పనిచేస్తోందని  ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. సార్స్‌కోవ్-2 దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాన్ని కూడ అడ్డుకొంటుందని ఐసీఎంఆర్ తెలిపింది.  యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్ లను బంధించి కల్చర్ చేసినట్టుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బుధవారం నాడు ప్రకటించింది.

ఇటీవలే భారత్ లో కన్పిస్తున్న డబుల్ మ్యూటెంట్ రకాన్ని కూడ బందించి పరీక్షలు నిర్వహించింది. దీనిపై కూడా కోవాగ్జిన్ బలంగా పనిచేస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది.దేశంలో ఇప్పటికే  కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతిచ్చింది. గత వారంలో రష్యాకు చెందిన స్పత్నిక్ వ్యాక్సిన్ కు  కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశాల్లో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్లకు కూడ కేంద్రం అనుమతివ్వాలని నిర్ణయం తీసుకొంది. దీంతో  వ్యాక్సిన్ కొరతను అధిగమించే అవకాశం ఉందని  కేంద్రం భావిస్తోంది.  

మరో వైపు ఇండియాలో  వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలు కూడ తమ ఉత్పత్తిని పెంచాలని ప్రధాని మోడీ మూడు రోజుల క్రితం కోరారు. ఈ విషయమై ఫార్మా కంపెనీలు కూడ సానుకూలంగా స్పందించాయి.  ఈ ఏడాది మే 1వ తేదీ నుండి  18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయనున్నారు.