ఇప్పుడే పిల్లలు వద్దని పుట్టినింటికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?
ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు ఆయన భార్యనే కారణం అని పెట్టిన కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. పిల్లలు ఇప్పుడే వద్దని నిర్ణయాన్ని వాయిదా వేసి భార్య పుట్టినింటికి వెళ్లింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్తకు వెంటనే పిల్లలు కనాలని ఉన్నది. కానీ, భార్య అంగీకరించలేదు. ఆమె పుట్టినింటికి వెళ్లిపోయింది. మెట్టినింటిలో కలిసి జీవించడానికి సరిపడా స్థలం లేదని ఆమె వెళ్లిపోయింది. అత్తమామ కుటుంబంతో వేరు పడి విడిగా అద్దెకు గది తీసుకోవాలనీ భర్తను కోరింది. కానీ, అది జరగలేదు. పెళ్లయ్యాక చాలా సార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. ఆమె పుట్టినింటికి వెళ్లిపోయింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్యకు భార్య కారణం అని, ఆమె వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదైంది. ఈ కేసు కోర్టు వరకు వెళ్లింది. తాజాగా, ఈ కేసులో కోర్టు తీర్పు కూడా వెలువరించింది.
ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాజ్ కుమార్ కనోజియా సాధనను పెళ్లి చేసుకున్నాడు. 2017 మే 21నాడుడ ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఓ సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన భార్య గురించి ప్రస్తావించాడు. పిల్లలు కావాలని తాను అడిగితే ఆమె వాయిదా వేస్తూ వేధిస్తున్నట్టు అందులో రాశాడు. ఓ రోజు తాను పనికి వెళ్లినప్పుడు ఆమె ఫోన్ చేసింది. భర్త తల్లిదండ్రులు, సోదరులకు దూరంగా గది అద్దెకు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భర్తతో ఏకాభిప్రాయానికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.
కోర్టు విచారిస్తూ.. ఆమెను నిర్దోషిగా వదిలిపెట్టింది. భర్తతో నివసించడానికి తగిన స్థలం లేదని పుట్టినింటికి వెళ్లడాన్ని తప్పుగా అర్థం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆమె తన భర్తను ఇలా డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టలేమని, భర్త ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అలా డిమాండ్ చేసిందని చెప్పలేమని వివరించింది.
Also Read: మరోసారి వర్చువల్‌గా భేటీ అవుదాం.. బ్రెజిల్ బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. ప్రధాని మోడీ ప్రతిపాదన
రాజ్ కుమార్ కనోజియా హైపర్ సెన్సిటివ్ అని, భార్య ప్రవర్తనతో ఆయన ఓవర్ రియాక్టివ్ అయ్యాడని తెలిపింది. భార్య తనను చెప్పుచేతల్లోకి తీసుకుందని నిజానికలా కాకపోయినా భావించాడని వివరించింది. భర్త ఆత్మహత్యకు ఆమె పురికొల్పినట్టుగా ఆధారాలు లేవని కేసు కొట్టేసింది. ఆమెను కేసు నుంచి విముక్తి చేసింది.