సై అంటే సై.. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భార్య, భర్తల మధ్యే పోటీ
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భార్య, భర్తలు ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇద్దరూ ఒకే స్థానంలో పోటీ చేయడబోతుండటంతో రాంగఢ్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
జైపూర్: రాజస్తాన్‌లోని దంత రాంగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటున్నది. ఇంట్లో భార్య, భర్తలైనా.. బరిలో మాత్రం ప్రత్యర్థులవుతున్నారు. రీతా చౌదరిని రాంగఢ్ నుంచి బరిలోకి దించబోతున్నట్టు హర్యానా బేస్ ఉన్న జేజేపీ ప్రకటించింది. కాగా, ఆమె భర్త, సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్‌ను మళ్లీ పోటీలో నిలపాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. దీంతో నవంబర్ 25వ తేదీన జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ భార్య, భర్తల మధ్యే సంగ్రామం జరగనుంది.
వీరేంద్ర సింగ్ తండ్రి నారాయణ్ సింగ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారాయణ్ సింగ్ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోగానే వీరేంద్ర సింగ్ ఎంటర్ అయ్యారు. విజయవంతంగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆయన భార్య రీతా చౌదరి ఆగస్టు నెలలో జననాయక్ జనతా పార్టీలో చేరారు. ఆమెను జేజేపీ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిని చేశారు.
దంత రాంగఢ్ నుంచి పోటీ చేయడానికి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముంద కాంగ్రెస్ టికెట్‌ను రీతా చౌదరి కోరారు. కాంగ్రెస్ ఆమెకు టికెట్ నిరాకరించారు. ఆమె భర్తను అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది.
Also Read: వచ్చే రామనవమి.. అయోధ్య రామ మందిరంలోనే: ప్రధాని మోడీ
రీతా చౌదరి మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి, నా రంగ ప్రవేశంతో వారు సంతోషంగా ఉన్నారు. దంత రాంగఢ్ సీటు నుంచి పార్టీ నన్ను అభ్యర్థిగా ఎంచుకుంది. నా విజయం పై నాకు అచంచల విశ్వాసం ఉన్నది’ అని తెలిపారు. భర్తపై పోటీ చేయడం గురించి ప్రస్తావించగా.. ‘కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను(ఆ నియోజకవర్గంలో) ప్రకటించలేదు. కాబట్టి, ఈ విషయంపై నేను కామెంట్ చేయబోను. కానీ, ప్రజలు మాత్రం మార్పు కావాలని కోరుకుంటున్నారు’ అని అన్నారు.
అదే రీతా చౌదరి భర్త మాట్లాడుతూ.. ‘జేజేపీ ఆమెను బరిలోకి దింపింది. నేనే మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నాను. ఈ స్థితిలో భార్య, భర్తల మధ్య నేరుగా పోటీ ఉంటుందని అర్థం అవుతున్నది’ అని వీరేంద్ర సింగ్ అన్నారు.