గురుగ్రామ్‌లో 17 ఏళ్ల బాలికను టేక్కీ దంపతులు పని మనిషిగా నియమించుకుని చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల హక్కులను దుర్వినియోగం చేసిన దంపతులు ఉద్యోగాలు కోల్పోయారు. మహిళ పనిచేసిన పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ, ఆమె భర్త ఉద్యోగం చేస్తున్న బీమా కంపెనీలు ఉద్యోగం నుంచి తొలిగించినట్టు ప్రకటించాయి.
పేదరికం ఓ బాలికకు శాపంగా మారింది. ఆడి పాడాల్సిన వయస్సులో ఓ చిన్నారికి ఆయాగా మారాల్సి వచ్చింది. కానీ.. ఆ పనిలో నిత్యం నరకం చూసింది. తనను పనిలో పెట్టుకున్న దంపతులు నిత్యం చిత్రహింసలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కనీసం సరైన తిండి పెట్టకుండా.. మానసికంగా, శారీకంగా చిత్రహింసలకు గురి చేశారు. ఎలాగోలా ఈ విషయం తెలిసిన ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బాలిక నరకకూపంలో నుంచి బయటపడింది.
మైనర్ ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురి చేసి లైంగికంగా వేధించిన దంపతులను అరెస్టు చేశారు. మైనర్ పనిలో పెట్టుకున్న పిల్లల హక్కులను హరించిన దంపతులను వారి వారి సంస్థలు ఉద్యోగాల నుండి తొలగించాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చేటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. న్యూ కాలనీలో నివసిస్తున్న మనీష్ ఖట్టర్ (36), అతని భార్య కమల్జీత్ కౌర్ (34)లు గత ఐదు నెలల క్రితం.. ఓ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ద్వారా 17 ఏండ్ల బాలికను పనిమనిషిగా నియమించుకున్నారు. ఆ జంట తనని పనిలో పెట్టుకుని రోజు నుండి నిత్యం నరకం చూపించారనీ, ప్రతిరోజు కనికరం లేకుండా కొట్టారని బాధిత బాలిక తన ఆవేదనను వ్యక్తం చేసింది. బాలిక చేతులు, పాదాలు, నోటిపై అనేక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా మనీష్ ఖట్టర్ బాలికను వివస్త్రను చేసి, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయపరిచేవాడనీ, భార్యాభర్తలు తనను ఇంటి వద్దే బంధించారని, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు అనుమతించలేదని బాధితురాలు తెలిపింది.
ఆ దంపతులు రాత్రిపూట నిద్రపోనివ్వరని, ఆహారం కూడా ఇవ్వలేదని పేర్కొంది. బాలిక నోరు పూర్తిగా ఉబ్బింది, ఆమె శరీరంపై ప్రతిచోటా గాయం గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేరకు.. దంపతులిద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 323 (బాధించడం), 342 ( నిర్బంధించడం), జువెనైల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాధితురాలికి నెలకు ₹ 10,000 తీసుకున్నట్లు చెప్పబడుతున్న ప్లేస్‌మెంట్ ఏజెన్సీ కోసం ఒక బృందం గురువారం ఢిల్లీలో సోదాలు నిర్వహించిందని పోలీసులు తెలిపారు.
పోలీసు రిమాండ్‌లో ఉన్న ఖట్టర్ తన కుమార్తె సంరక్షణ కోసం ఐదు నెలల క్రితం ..ఆ బాలికను నియమించుకున్నాడని, ఆన్‌లైన్‌లో ప్లేస్‌మెంట్ ఏజెన్సీని సంప్రదించినట్లు ఎస్‌హెచ్‌ఓ న్యూకాలనీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దినకర్ తెలిపారు. ఖట్టర్ గురుగ్రామ్ నివాసి కాగా, ఆయన భార్య రాంచీకి చెందినవారు. ఢిల్లీలో ఏజెన్సీ కోసం దర్యాప్తు చేస్తున్నారనీ, బాధితురాలు తప్పు చేసినప్పుడు కోపం వచ్చి ఆమెను కొట్టేవాడని నిందితుడు కూడా అంగీకరించాడనీ, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.
దంపతులను ఉద్యోగాలను నుంచి తొలగింపు..
కౌర్ ఉద్యోగ తొలగింపుపై పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ ఇలా ట్వీట్ చేసింది: "కమల్జీత్ కౌర్‌పై మానవ హక్కులు , పిల్లల దుర్వినియోగ ఆరోపణల గురించి తెలుసుకున్నప్పుడు మేము షాక్ అయ్యాము. ఒక సంస్థగా, మేము భారతీయ న్యాయ వ్యవస్థను గౌరవిస్తాము, ఏ విధమైన మానవ హక్కుల ఉల్లంఘనకు సహించం. కంపెనీ ఆమె సేవలను తక్షణమే రద్దు చేసింది" అని పేర్కొంది. మనీష్ ఖట్టర్ పని చేస్తున్న భీమా సంస్థ కూడా అతని ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ ఘటనపై జార్జండ్ ముఖ్యమంత్రి స్పందించారు. బాలిక పునరావాసం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సహాయాన్ని అందించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. పిల్లలను హింసించే ఈ అమానవీయ చర్య తనని తీవ్ర మనోవేదనకు గురి చేసిందనీ, NCPCR ఈ గంభీరమైన విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతతో గమనించి, బాలికకు తిరిగి ఆమె కుటుంబానికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నామని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.
