ఏడాదిలోగా మాకు మనవడు లేదా మనవరాలిని ఇవ్వండి. లేదంటే రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వండి.. అంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన దంపతులు ఓ కోర్టును ఆశ్రయించారు. తమ కొడుక్కి 2016లో పెళ్లి చేశామని, ఇప్పటికీ సంతానంపై ఫోకస్ పెట్టడం లేదని ఆ తల్లిదండ్రులు వాపోయారు. 

న్యూఢిల్లీ: కొన్ని విషయాలు చాలా రోటీన్‌గా అనిపిస్తుంటాయి. అవి అలా జరిగి తీరాల్సిందే. సమాజాలను బట్టి వాటి నైతిక బాధ్యతలు, నిబంధనలూ మారుతుంటాయి. అందులో కొన్ని ఇలా ఉంటాయి. భార్య, భర్త పిల్లలను కనాల్సిందే. వారి ఆలనా పాలనా చూడాల్సింది. వారికి పెళ్లి చేయాల్సిందే. ఆ తర్వాత వారి పిల్లలతో అంటే మనవడు లేదా మనవరాలితో ఆడుకోవాలి. ఈ సైకిల్ తప్పదు. అయితే, ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు దంపతులు తమ కొడుకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తపించారు. వారి శాయశక్తులు కష్టపడి చదివించారు. ఆ తర్వాత పెళ్లి చేశారు. వారి బాధ్యతలు అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. కానీ, ఆ తర్వాత రావాల్సిన ఫలితం అదేనండీ.. మనవడు లేదా మనవరాలి గురించి ఎదురుచూస్తూనే ఉన్నారు. తన కొడుకు, కోడలు తమకు మనవడు లేదా మనవరాలిని కనడం లేదని బెంగపడ్డారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. తనకు మనవడు లేదా.. మనవరాలు కావాలని ఎస్ఆర్ ప్రసాద్ ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని ఓ కోర్టులో డిమాండ్ చేశాడు.

ఔను.. తమ కొడుకు, కోడలు పిల్లలను కనాలని లేదంటే.. తమకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విచిత్ర కేసు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగులోకి వచ్చింది. వారు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాము తమ కుమారుడికి 2016లో పెళ్లి చేశామని, అప్పటి నుంచి పిల్లల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మనవడైనా.. మనవరాలైనా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమకు కేవలం తమ కుమారుడి సంతానం కావాలని అన్నారు. 

తాను సంపాదించిన డబ్బును మొత్తం కొడుకు కోసమే ఖర్చు పెట్టానని ఎస్ఆర్ ప్రసాద్ వివరించాడు. తన కొడుకుకు అమెరికాలో ట్రైనింగ్ ఇప్పించానని తెలిపాడు. ఇప్పుడు తమ దగ్గర డబ్బు లేదని పేర్కొన్నాడు. ఇల్లు కట్టడానికి కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నామని వివరించాడు. తాము ఆర్థికంగా, వ్యక్తిగతంగా చిక్కులు ఎదుర్కొంటున్నామని చెప్పాడు. అందుకే తాము తమ కొడుకు నుంచి రూ. 2.5 కోట్లు, కోడలు నుంచి రూ. 2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నాడు.

ప్రసాద్ తరఫు న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ కేసు ప్రస్తుత సమాజంలోని వాస్తవాలను వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు. ‘మనం మన పిల్లల్లో పెట్టుబడి పెడతాం. మంచి కంపెనీల్లో పని చేయడానికి శాయశక్తుల పని చేస్తాం. పెద్దల ఆర్థిక కష్టాలను తీర్చే బాధ్యత పిల్లలకు ఉంటుంది. ఈ తల్లిదండ్రులు తమ కొడుకు కోడలు ఏడాదిలోగా నుంచి సంతానాన్ని ఆశిస్తున్నారు. లేదంటే రూ. 5 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు’ అని న్యాయవాది ఏకే శ్రీవాస్తవ వివరించారు.