బెంగుళూరు: దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నత్యాగరాజ్... ఓ వివాహితను లోబర్చుకొన్నాడు. కొంతకాలం పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత  భర్తతో ఉంటున్న ఆ వివాహితను ఆ పూజారి వేధించాడు. వివాహిత తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలుకా సాదరహళ్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకొంది.  లోకేష్, అతని భార్య కౌసల్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల ఆత్మహత్యకు కారణమైన పూజారి త్యాగరాజ్ గ్రామం నుండి పారిపోయాడు.  దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. 

లోకేష్, కౌసల్య ఇంటి పక్కనే  పూజారి త్యాగరాజ్ నివాసం ఉండేవాడు. కౌసల్యకు మాయామాటలు చెప్పి ఆమెను లోబర్చుకొన్నాడు.  కొన్ని రోజుల పాటు బెంగుళూరు తీసుకెళ్లి ఆమెతో సహజీవనం చేశాడు.  అయితే కొన్ని రోజుల తర్వాత కౌసల్య పశ్చాత్తాపంతో భర్త ఇంటికి వచ్చింది.

భర్తతో ఆమె కాపురం చేస్తోంది. అయితే తనకు కౌసల్య దూరం కావడాన్ని పూజారి త్యాగరాజ్ తట్టుకోలేకపోయాడు. తాను సహజీవనం చేసే సమయంలో  కౌసల్యతో తాను సన్నిహితంగా ఉన్న పోటోలను పూజారి త్యాగరాజు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.  దీంతో కౌసల్య దంపతులు అవమానం భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పూజారి త్యాగరాజ్ ఇంటికి చేరుకొన్నారు. అయితే అప్పటికే  ఆయన ఇంటి నుండి పారిపోయాడు. గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు.  పూజారి కారును దగ్దం చేశారు. దీంతో దేవాలయం వద్ద నిలిపి ఉంచిన భక్తులకు చెందిన ఓ కారు, నాలుగు బైక్ లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు కూడ దగ్గమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.