Asianet News TeluguAsianet News Telugu

దేశానికి షార్ట్‌కట్ రాజకీయాలు అవసరం లేదు.. ప్రజలు వాటిపై అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ హెచ్చరిక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశవాద రాజకీయాలు, షార్ట్‌కట్ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి సుస్థిర అభివృద్ధి అవసరమని, షార్ట్‌కట్ రాజకీయాలు కాదని అన్నారు.

Country does not need shortcut politics says PM Modi
Author
First Published Dec 11, 2022, 3:18 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశవాద రాజకీయాలు, షార్ట్‌కట్ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి సుస్థిర అభివృద్ధి అవసరమని, షార్ట్‌కట్ రాజకీయాలు కాదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ము అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాలతో వృథా అయ్యేదని అన్నారు. ప్రధాని మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మానవీయ స్పర్శతో జరిగిందని అన్నారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశం అన్ని రాష్ట్రాల ఐక్య బలం, పురోగతి, అభివృద్ధి ద్వారా వాస్తవికత అవుతుంది. అభివృద్ధి పట్ల మనకు సంకుచిత దృక్పథం ఉంటే అవకాశాలు కూడా పరిమితంగా ఉంటాయి. గత ఎనిమిదేళ్లలో మేము సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌తో మనస్తత్వం, విధానాన్ని మార్చాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

నాగ్‌పూర్‌లో ప్రారంభించిన, మొదలుపెట్టిన ప్రాజెక్టులు అభివృద్ధి సమగ్ర దృక్పథాన్ని అందించాయని ప్రధాని మోదీ అన్నారు. రాజకీయ నాయకులు షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడడం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును దోచుకోవడం, తప్పుడు వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. షార్ట్‌కట్‌ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదని అన్నారు.

Also Read: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ.. ఆరో వందే భారత్ ట్రైన్, మెట్రో, ఎయిమ్స్‌ ప్రారంభం.. వివరాలు ఇవే..

         
‘‘కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి రాజకీయ నాయకులను, పార్టీలను ప్రజలు బయటపెట్టాలి. షార్ట్‌కట్ రాజకీయాలకు బదులు సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజకీయ నేతలందరికీ నా విజ్ఞప్తి. సుస్థిర అభివృద్ధితో ఎన్నికల్లో విజయం సాధించవచ్చు’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios