Asianet News TeluguAsianet News Telugu

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ.. ఆరో వందే భారత్ ట్రైన్, మెట్రో, ఎయిమ్స్‌ ప్రారంభం.. వివరాలు ఇవే..

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

PM Modi Inaugurates Nagpur Metro, AIIMs Flags Off 6th Vande Bharat Train
Author
First Published Dec 11, 2022, 1:15 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ రోజు ఉదయం నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు స్వాగతం పలికారు. తొలుత ప్రధాని మోదీ.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ప్రధాని మోదీ చేతులు ఊపి అభివాదం చేశారు. ఇక, ఇది దేశంలో ప్రారంభించబడిన ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

అనంతరం ప్రధాని మోదీ నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించిన మోదీ.. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి ఫ్రీడం పార్క్ స్టేషన్ నుంచి ఖాప్రి స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. ఖాప్రి స్టేషన్‌‌కు చేరుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోని ఆరెంజ్, ఆక్వా లైన్‌లలో రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఫేజ్-1 కింద 36 స్టేషన్లు ఉన్నాయి. రూ. 8,650 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

 

ఇక, నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2కి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.  6,700 కోట్ల పాయలతో ప్రాజెక్టు ఫేజ్-2 అభివృద్ధి చేయనున్నారు. ఇది 32 స్టేషన్లను కలిగి ఉంటుంది. అలాగే 43.8 కి.మీ పరిధిలో విస్తరించి ఉండనుంది. 

 

అనంతరం ప్రధాని మోదీ.. నాగ్‌పూర్-ముంబై మొదటి దశ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. మొదటి దశ నాగ్‌పూర్‌- అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీల మధ్య 520 కి.మీ విస్తరించి ఉంది. ‘‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’’ అని అధికారికంగా పేరు పెట్టబడిన మొత్తం ప్రాజెక్ట్ పొడవు 701 కి.మీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆలోచన. 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించబడింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయిన తర్వాత నాగ్‌పూర్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గుతుంది. దాదాపు రూ.55,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని 10 జిల్లాల మీదుగా సాగుతోంది.

ఆ తర్వాత ప్రధాని మోదీ నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రారంభించారు. ఈ సదుపాయానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీనిని రూ. 1,575 కోట్లతో నిర్మించారు. ఇది వార్ధా రోడ్ ప్రాంతంలో ఉంది. ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని, విదర్భ ప్రాంతానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ డోలు వాయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios