నెల్లూరు: ఇస్రో ధృవ ఉపగ్రహ వాహక నౌక (పీఎస్‌ఎల్వీ) 51వ సారి గగనయానానికి సిద్దమైంది.

పీఎస్‌ఎల్వీసీ -49 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ లో ఉన్న మొదటి ప్రయోగ వేదిక నుండి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ సీ49 రాకెట్ ను ప్రయోగించే సన్నాహల్లో శాస్త్రవేత్తలు ఉన్నారు.

శుక్రవారం నాడు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే కౌంట్ డౌన్ శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత పీఎస్‌ఎల్వీ సీ49 రోదసీలోకి దూసుకుపోనుంది.

భూ పరిశీలన ఉపగ్రహం, ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షల్లో ప్రవేశ పెట్టనున్నారు.

వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ సహాయంలో అనువర్తనాల కోసం ఉద్దేశించిన భూమి పరిశీలన ఉపగ్రహం అని ఇస్రో ప్రకటించింది.ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్  తో వాణిజ్య ఒప్పందం ప్రకారం ప్రయోగించనున్నట్టుగా తెలిపింది.