Coronavirus Update: ఈ రాష్ట్రాల్లోనే కరోనా కొత్త కేసుల నమోదు ఎక్కువ.. !
Coronavirus: భారత్ లో పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదైన మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా, COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Covid-19 Update: భారత్ లోనూ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించడం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్య బృందాలు, అధికార యంత్రాంగాలు పేర్కొంటున్నాయి.
సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,207 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,31,05,401 కు చేరుకుంది. ఇందులో క్రియాశీల కేసులు 20,403గా ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ తో పోరాడుతూ 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 5,24,093కు చేరుకుంది. దేశంలో నమోదైన మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా, COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ, మే 8తో ముగిసిన వారంలో వైరస్ కారణంగా సంభవించిన మరణాలు తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం.
కొత్త కేసులు ఈ రాష్ట్రాల్లోనే అధికం..
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా వైరస్ కొత్త కేసులు అధికంగా ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, దేశంలో మొత్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.
తగ్గిన పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రోజువారీ పాజిటివిటీ రేటు 0.95 శాతంగా ఉండగా, వారంవారీ సానుకూలత రేటు 0.82 శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉన్నాయి.
190.3 కోట్లు దాటిని కరోనా టీకాల పంపిణీ
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 190.3 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. అందులో మొదటి డోసుల సంఖ్య 91.5 కోట్లు ఉండగా, రెండు డోసుల తీసుకున్న వారి సంఖ్య 81.6 కోట్లుగా ఉంది.
మొత్తం 84,06,93,082 కరోనా పరీక్షలు
కొత్త వేరియంట్లు వెలుగుచూడటం, కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కరోనా పరీక్షల కార్యక్రమాలు పెంచుతున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 84,06,93,082 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,60,613 కరోనా పరీక్షలు నిర్వహించారు.