చెట్టు కింద ప్లీడర్.. ఈ పేరు చాలా సార్లు వినే ఉంటారు. మరి చెట్టు పైన ప్లీడర్ పేరు ఎప్పుడైనా విన్నారా..? కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు వినాల్సి వచ్చింది.  ఓ లాయర్ కి కరోనా ఎఫెక్ట్ కి చెట్టు మీద ప్లీడర్ గా మారాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముకుల్‌ త్యాగి అనే న్యాయవాది హాపూర్‌ సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకున్నారు. నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను ఇలా ఇంటిని నిర్మించుకున్నానని ఆయన చెప్పడం గమనార్హం.

ఇదే విషయంపై ఆయన కుమారుడు మాట్లాడుతూ..  ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహాయంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు. ఇదిలా ఉండగా.. యూపీలో కరోనా కేసులు 400 దాటడం గమనార్హం.