బెంగుళూరు:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ లో నిశ్చితార్థం జరుపుకొంది ఓ జంట. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. కరోనా లాక్ డౌన్  పెళ్లిళ్లతో పాటు పలు శుభకార్యాలపై కూడ ప్రభావాన్ని చూపుతోంది. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కొందరు తమ ఇళ్లలో జరపాల్సిన ఫంక్షన్స్ వాయిదా వేశారు మరికొందరు మాత్రం నామ మాత్రంగా తమ ఇళ్లలో శుభకార్యాలను నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా హుక్కెరి తాలుకాలోని అత్తిహల హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పీడీపాటిల్ తన కూతురు అనూష నిశ్చితార్ధాన్ని మొబైల్ వీడియో కాల్ ద్వారా నిర్వహించాడు. 

also read:కరోనా ఎఫెక్ట్: పోలీసులను తప్పించుకొనేందుకు ఈదుకొంటూ మృత్యు ఒడిలోకి

సంకేశ్వరలో అనూష ఉంది. బాగల్ కోటలో  అనూషకు కాబోయే భర్త మహంతేష్ నివాసం ఉంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు ఒకే చోట కలిసే సమయం లేకపోయింది. దీంతో ఈ రెండు కుటుంబాలు వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థం జరుపుకోవాలని  నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నిర్ణయంలో భాగంగా ఈ రెండు కుటుంబాలు ఆన్ లైన్ లో నిశ్చితార్థం గురువారం నాడు జరుపుకొన్నారు.  ఈ ఆన్ లైన్ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కరోనా వైరస్ నేపథ్యంలో పలువురు ఇప్పటికే తమ ఇళ్లలో జరుపుకోవాల్సిన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే కొందరు ఫంక్షన్లకు ముందుకు వస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొంటుంది.