కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ మొన్న జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! జనతా కర్ఫ్యూ తోపాటుగా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా వైద్య సేవలందిస్తున్న వారందరికీ, ప్రజల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి థాంక్స్ చెప్పడానికి అందరిని బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలుపమని కూడా చెప్పారు. అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

also read:ఈశాన్య రాష్ట్రాలకు పాకిన కరోనా: మణిపూర్ లో తొలి పాజిటివ్ కేసు

అదేరోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 కరోనా ప్రభావిత జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చేసేయాలని ఆదేశించింది. అందుకనుగుణంగా అన్ని రాష్ట్రప్రభుత్వాలు ఆదేశాలను పాటించాయి. ఢిల్లీలోని 7 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

గత 101 రోజులుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటి ఉదయం వారందరిని అక్కడి నుండి పోలీసులు ఖాళీ చేయించి వేశారు. 

కరోనా విజృంబిస్తున్నప్పటి నుండే వారికి పదే పదే పోలీసులు, ప్రభుత్వం విజ్ఞప్తులు చేసింది. వారు కూడా చాలా తక్కువ మంది మాస్కులతోనే పాల్గొంటున్నప్పటికీ... షట్ డౌన్ ప్రకటించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా వారిని ఖాళీ చేయించారు. 

అడ్డు తగిలిన 6గురు మహిళలను, 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఢిల్లీలో జఫరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసన శిబిరాలను కూడా కరోనా వైరస్ నేపథ్యంలో తొలిగిస్తామని పోలీసులు ప్రకటించారు. 

 ఇకపోతే...  భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల సంఖ్య 500కు చేరువలో ఉంది. మంగళవారం ఉదయానికి భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మణిపూర్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

మిజోరం, మణిపూర్ మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రోడ్ల మీదికి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

మహారాష్ట్ర 84, మరణాలు 3
ఆంధ్రప్రదేశ్ 7
కర్ణాటక 37, మరణాలు 1
మణిపూర్ తొలి కరోనా కేసు
తమిళనాడు 12
తెలంగాణ 33
బీహార్ 2, మరణాలు 1
రాజస్తాన్ 26
పంజాబ్ 21, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 7 మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 12
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
మధ్యప్రదేశ్ 7
ఒడిశా 2
లడక్ 3
ఉత్తరాఖండ్ 3
కేరళ 87
గుజరాత్ 29, మరణాలు 1
ఢిల్లీ 30 మరణాలు 1

దేశంలోని 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. మొత్తం 548 జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా ల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. సోమవారంనాడు ఒక్క రోజే 75 తాజా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యయ్యాయి.  వారిలో 41 మంది విదేశీయులు.  

గుజరాత్, బీహార్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి.